
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన 5వ రోజుకు వార్షికోత్సవాలు చేరుకున్నాయి. స్వామి వారు నేడు (ఆదివారం) తన ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై భక్తులకు అనుగ్రహం ఇవనున్నారు. గరుడ వాహనంపై విహరించనున్న శ్రీవారి మూలవిరాట్కు సహస్ర నామాల మాల, లక్ష్మీ కాసుల మాల, పచ్చల హారం స్వామి వారికి అలంకరిస్తారు. గరుడ వాహనంపై విహరించే స్వామి వారిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్త కోటి ప్రగాఢ నమ్మకం. అందుకే శ్రీవారిని గరుడ వాహనం రోజు దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు.
గరుడ వాహన సేవకు ఆలయ మాడ వీధుల్లోని గ్యాలరీలు నిండు కుండలా మారుతున్నాయి. ఇప్పటికే గ్యాలరీలలోకి లక్ష మందికి పైగా భక్తులు చేరుకున్నారు. తిరుమలలో ఎటు చూసినా భక్తుల కోలాహలమే కనిపిస్తోంది. ఆలయ మాడ వీధుల్లోనూ, ఔటర్ రింగ్ రోడ్డులోకి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. తిరుపతి నుంచి ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిండి తిరుమల కొండ పైకి చేరుకుంటున్నాయి. గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. చంటి పిల్లలకోసం పాలను కూడా టీటీడీ గ్యాలరీలలో అందిస్తున్నారు.
3 లక్షలకు పైగా భక్తులు గరుడ వాహన సేవకు విచ్చేసే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ ఏడాది మరింత మంది సామాన్య భక్తులకు గరుడ వాహన సేవ దర్శన భాగ్యం కల్పించేందుకు రీఫిల్లింగ్ వ్యవస్థను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. గరుడ సేవ సందర్భంగా గురువారం సాయంత్రం నుంచి ద్విచక్ర వాహనాల అనుమతిని టీటీడీ రద్దు చేసింది. గరుడ వాహనసేవకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న క్రమంలో.. 5 వేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి టీటీడీ కమాండ్ కంట్రోల్ రూంలో భద్రతను అధికారులు పర్యవేక్షించనున్నారు.