వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
  • స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆదివారమే రాజన్న ఆలయానికి చేరుకున్న భక్తులు సోమవారం కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు. అనంతరం ధర్మగుండంలో పవిత్ర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు.

కోరిన కోర్కెలు తీరాలని కోరుకుంటూ కోడె మొక్కులు చెల్లించడంతో పాటు, కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ కారణంగా ప్రసాదం కౌంటర్, కోడెల టికెట్‌‌‌‌‌‌‌‌ కౌంటర్లు కిక్కిరిసిపోయాయి. మరో వైపు ఆలయ స్థానాచార్యుల ఆధ్వర్యంలో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. వేములవాడ అనుబంధమైన భీమేశ్వర ఆలయంలోనూ భక్తుల రద్దీ కనిపించింది.