యాదగిరిగుట్ట, వెలుగు: నారసింహుడి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం యాదగిరిగుట్టలో నిర్వహించిన గిరిప్రదక్షిణకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం 6 గంటలకు వైకుంఠద్వారం వద్ద ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు.
కొండ చుట్టూ రెండున్నర కిలోమీటర్లు ప్రదక్షిణ చేసిన అనంతరం మెట్ల మార్గం గుండా పైకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా గిరిప్రదక్షిణ మార్గానికి ఇరువైపులా, గోశాల, సంస్కృత పాఠశాల ప్రాంగణంలో దాదాపు రెండు వేల మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఈవో భాస్కర్‌రావు, చైర్మన్ నరసింహమూర్తి, మాజీ ఉపసర్పంచ్ గుండ్లపల్లి భరత్‌గౌడ్, కౌన్సిలర్లు గుండ్లపల్లి వాణి, ముక్కెర్ల మల్లేశ్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు పన్నీరు భరత్, ఎరుకల హేమేందర్‌గౌడ్, ఈఈ దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.