మేడారం మహా జాతరకు కదిలిన మహా నగరం

మేడారం మహా జాతరకు కదిలిన మహా నగరం
  •     మేడారానికి భారీగా వెళ్తున్న సిటీవాసులు
  •     ప్రతిసారి ఐదారు లక్షల మంది  దర్శనం 
  •     ఆర్టీసీ బస్సులతో పాటు బైక్ లు, కార్లలోనూ జర్నీ 

హైదరాబాద్, వెలుగు : మహానగరం నుంచి మేడారం మహాజాతరకు జనాలు భారీగా  తరలి వెళ్తున్నారు. సమ్మక్క – సారక్క జాతర జరిగే ప్రతిసారి సిటీ నుంచి దాదాపు ఐదారు లక్షల మందిదాకా వెళ్లి వస్తుంటారు. సమ్మక్క– సారక్కలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఉప్పల్, ఎల్​బీనగర్, సైదాబాద్, సికింద్రాబాద్, బాలానగర్, మౌలాలి, అంబర్ పేట్, ఓల్డ్ సిటీ తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా ప్రజలు తరలివెళ్తుంటారు. బుధవారం నుంచి ప్రారంభమైన మేడారం జాతర ఈనెల 24 వరకు కొనసాగనుంది.

ఇప్పటికే భక్తులు  పోటెత్తడంతో ముందే చాలా మంది వెళ్లి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. సిటీ నుంచి దాదాపు లక్ష మంది వరకు వెళ్లొచ్చినట్టు తెలిసింది. మూడురోజుల్లో  మరో నాలుగైదు లక్షల మంది వెళ్లనున్నారు. ఫ్రెండ్స్ తో పాటు కుటుంబ సభ్యులతో  కలిసి ప్రయాణిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి జాతరకు భక్తులు పెరిగినట్లు వెళ్లి వచ్చినవారు చెబుతున్నారు.  

ప్రత్యేక బస్సులు 

ఇప్పటికే సిటీ నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. గ్రేటర్ లో మొత్తం 2500 బస్సులు ఉండగా,  జాతర డిమాండ్ మేరకు ఇప్పటికే 1200  బస్సులను జాతరకు తిప్పుతున్నారు. మరో 500 బస్సులను నడిపేందుకు రెడీగా ఉంచారు. ఉప్పల్ బస్టాపు నుంచే మేడారం జాతర ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. వెళ్లేందుకు భారీగా భక్తులు వస్తుండటంతో అక్కడ ప్రత్యేకంగా టెంట్ లు ఏర్పాటు చేసి, కుర్చీలు

వాటర్ ఫెసిలిటీ కల్పించడంతో పాటు భక్తులకు సూచనలు ఇచ్చేందుకు వలంటీర్లను సైతం ఆర్టీసీ నియమించింది. సిటీలో 800 బస్సులు మాత్రమే తిరుగుతుండగా, సరిగా అందుబాటులో లేక ప్రయాణికులు కొద్దిగా ఇబ్బందులు పడ్డారు. 

సొంత వాహనాల్లోనూ.. 

జాతరకు సిటీ నుంచి బస్సులు ఫుల్​రష్ తో నడుస్తుండటం, దాదాపు 250 కిలోమీటర్ల దూరం ఉండడంతో సొంత వాహనాల్లో వెళ్లడానికి కొంతమంది భక్తులు ఇంట్రెస్ట్​చూపిస్తున్నారు. ప్రధానంగా యూత్ బైకులపై వెళ్తున్నారు. ఫ్యామిలీస్ తో వెళ్లేవారు కార్లు, ఆటోలు, ట్రాలీల్లో తరలివెళ్తున్నారు. మరికొందరు ప్రైవేట్​బస్సులను, కార్లను అద్దెకు తీసుకుని మరీ ప్రయాణిస్తున్నారు. దీంతో వరంగల్ హైవే వాహనాలతో ట్రాఫిక్ రద్దీగా మారింది. ఎలాగోలా అయితే అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తున్నారు.

ఎల్లుండి పోతున్న.. 

రెండేండ్ల నుంచి మేడారం జాతరకు పోతున్న. ఫ్రెండ్స్​తో కలిసి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటా. ఈ సారి కూడా ఎల్లుండి పోవాలని అనుకుంటున్నం. సొంత వెహికల్ లో వెళ్తాం. మేడారం జాతర అంటే చాలా ఇష్టం.  

– మైపాల్ గౌడ్, వనస్థలిపురం  

ప్రతిసారి తప్పకుండా పోత.. 

మేడారం మహాజాతరకు ప్రతిసారి తప్పక వెళ్తా. ఈసారి కూడా తొలిరోజు హైదరాబాద్ నుంచి వచ్చా. అమ్మవార్లని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నా. జాతర ప్రారంభానికి ముందే భారీగా జనం వచ్చారు. మొదటి రోజైతే లక్షల్లో ఉన్నారు.  

– యాకయ్య, అంబర్ పేట్