వేములవాడకు పోటెత్తుతున్న భక్తులు

వేములవాడకు పోటెత్తుతున్న భక్తులు
  • గత నెలలో ఆలయానికి రూ.6 కోట్ల37లక్షల ఆదాయం

వేములవాడ, వెలుగు: వచ్చే నాలుగు ఆదివారాల్లో వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని 24 గంటలు తెరిచి ఉంచాలని అధికారులు నిర్ణయించారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర దగ్గరపడడంతో భక్తుల రద్దీ పెరిగింది. మేడారానికి వెళ్లే ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో జాతర ముందు వరకు ప్రతి ఆదివారం రోజంతా భక్తులను రాజన్న దర్శనానికి అనుమతించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21, 28 తేదీలతోపాటు, ఫిబ్రవరి 4, 11,18 తేదీల్లో రాజన్న ఆలయం తెల్లవార్లు తెరిచే ఉంటుందని, కోడె మొక్కులు, దర్శనాలు కొనసాగుతాయని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.

కాసుల వర్షం

నెల రోజులుగా రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. అదే స్థాయిలో ఆదాయం వస్తోంది. గడిచిన 36 రోజుల్లో మూడుసార్లు ఆలయ హుండీలను లెక్కించగా రూ.6 కోట్ల 37 లక్షల ఆదాయం, 840 గ్రాముల బంగారం, 37 కిలోల వెండి సమకూరింది. డిసెంబర్​12న హుండీలను లెక్కించగా రూ.కోటి 99 లక్షల 38వేలు, 203 గ్రాముల బంగారం, 10  కిలోల వెండి సమకూరింది. డిసెంబర్​26న జరిపిన లెక్కింపులో రూ.కోటి86 లక్షల ఆదాయం వచ్చింది. అలాగే 360 గ్రాముల బంగారం, 14 కిలోల వెండి సమాకూరింది. తాజాగా జరిపిన హుండీల లెక్కింపులో భక్తుల కానుకలు డబుల్​అయినట్లు తేలింది. రూ.2 కోట్ల52లక్షల 29వేలు సమకూరింది. 277 గ్రాముల బంగారం, 13కిలోల280 గ్రాముల వెండిని భక్తులు సమర్పించారు.