వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ బద్ది పోచమ్మ ఆలయంలో మహిళలు బోనాలతో మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో, పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి తల్లీ దీవించూ అంటూ బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
బద్ది పోచమ్మ అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమ, నైవేద్యాలతో కూడిన బోనాలను సమర్పించారు. అలాగే పట్నాలు వేసి మొక్కు లు చెల్లించారు. ఈవో రమాదేవి ఆలయాన్ని సందర్శించి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను పరిశీలించారు. ఏఈవో జి.అశోక్ కుమార్, పర్యవేక్షకుడు వెంకటప్రసాద్, ఎస్పీఎఫ్ సిబ్బంది, ఆలయ ఉద్యోగులు ఉన్నారు.
పూర్ణాహుతితో ముగిసిన ఉత్సవాలు
రాజన్న ఆలయంలో మూడు రోజులుగా కొనసాగుతున్న శ్రీ గీతా జయంతి ఉత్సవాలు మంగళవారం పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా నాగిరెడ్డి మండపంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అర్చనలు, గీతాహోమం స్వామివారికి ఏకాంతంగా నిర్వహించారు.
