యాదగిరిగుట్టలో కుండపోతతో క్యూలైన్లలో తడిసిన భక్తులు

యాదగిరిగుట్టలో కుండపోతతో క్యూలైన్లలో తడిసిన భక్తులు

 

  •     పైకప్పు లేకపోవడంతో తిప్పలు  
  •     తడిబట్టలతోనే స్వామివారి దర్శనం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో గురువారం సాయంత్రం కుండపోత వానతో నారసింహుడి దర్శనం కోసం వచ్చి క్యూలైన్లలో ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూలైన్ల పైకప్పు సరిగా లేకపోవడంతో తడిసి ముద్దయి అలాగే వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సి వచ్చింది. అరగంట పాటు వర్షం దంచికొట్టడంతో గోల్డ్ క్యూలైన్ల నుంచి..అలాగే తూర్పు రాజగోపురం క్యూలైన్ల నుంచి ఆలయంలోకి చేరుకోవడానికి తిప్పలు పడాల్సి వచ్చింది. తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్లపైకప్పు ఉన్నా ఈదురుగాలులతో కూడిన వానకు భక్తులు తడిసిపోయారు. 

త్రితల గోపురం నుంచి ఆలయంలోకి చేరుకునే ఇన్నర్ ప్రాకారంలో క్యూలైన్ పై ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు సరిగ్గా లేక భక్తులు వర్షంలో తడుస్తూనే ఆలయంలోకి చేరుకున్నారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ఆఫీసర్లు ఆదాయం పెంచుకోవడంలో చూపిస్తున్న శ్రద్ధ భక్తులకు సదుపాయాలు కల్పించడంలో చూపించడం లేదని మండిపడ్డారు. స్వామివారి దర్శనం కోసం వీఐపీలు వస్తే దగ్గరుండి రాచమర్యాదలు చేస్తూ దర్శన ఏర్పాట్లు చేస్తున్న ఆఫీసర్లు..సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా దర్శనం కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.  

పౌల్ట్రీ ఫామ్స్​ కూలి 6500 కోళ్లు మృతి

శివ్వంపేట: మెదక్‌‌‌‌‌‌‌‌  జిల్లా శివ్వంపేట మండలం లింగోజిగూడలో గురువారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షానికి తోడు ఈదురుగాలులకు లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌కు చెందిన పౌల్ట్రీఫామ్స్‌‌‌‌‌‌‌‌ కూలిపోయాయి. దీంతో అందులో ఉన్న 6,500 కోళ్లు చనిపోయాయి. మొత్తం రూ. 17 లక్షల మేర నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల రేకుల షెడ్లు కూలిపోగా, ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.