ఆధ్యాత్మికం : అబద్ధం ఎక్కువ కాలం దాయలేరు.. వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది.. వేధిస్తుంది..!

ఆధ్యాత్మికం : అబద్ధం ఎక్కువ కాలం దాయలేరు.. వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది.. వేధిస్తుంది..!

అబద్ధం..ఎక్కువ కాలం దాయలేరు.. "నిజం నిప్పు లాంటిది". నిజానికి ఉన్న శక్తి దేనికీ లేదు. మనిషి వ్యక్తిత్వాన్ని నిలబెట్టడంలో నిజాన్ని మించినది మరొకటి లేదు. నిజం చెప్పినప్పుడు ధైర్యం, ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. నిజాన్ని దాచి, అబద్ధం చెప్తే అది వేధిస్తూనే ఉంటుంది. వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. అందరిలో నవ్వుల పాలు చేస్తుంది. నిజాన్ని ఎక్కువ కాలం దాచలేం. ఒకవేళ దాచినా, దానికోసం మరో అబద్ధం ఆడాల్సి వస్తుంది

అబద్ధం ఆడినా.... నిజం చెప్పినా... మనసుకు తెలుస్తూనే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా బలవంతంగా నిజాన్ని దాచి అబద్దం చెప్పమని ప్రలోభపెడితే సహజంగానే మనసు ఎదురు తిరుగుతుంది. నిజం గురించి, దానికున్న ప్రాధాన్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మన ప్రాచీన సాహిత్యంలో ఎన్నో చోట్ల నిజం గొప్పతనాన్ని వివరించే సంఘటనలు, సన్నివేశాలు , సందర్భాలు ఉన్నాయి.

శకుంతల చెప్పిన నిజం విలువ

వేటకై అడవికి వచ్చిన దుష్యంతుడు శకుంతలను గాంధర్వ వివాహం చేసుకుని రాజ్యానికి వెళ్లిపోతాడు. శకుంతలకు భరతుడనే కొడుకు పుడతాడు. దుష్యంతుడు ఎంతకీ తిరిగి రాకపో వడంతో కణ్వమహర్షి శకుంతలను, భరతుడిని దుష్యంతుడి దగ్గరకు పంపిస్తాడు. శకుంతల రాజ్యానికి వెళ్లి, నిండుసభలో కొలువై ఉన్న దుష్యంతుడితో వేటకు వచ్చినప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు. భరతుడు నీ కొడుకు" అని చెప్తుంది. దుష్యంతుడు ఒప్పుకోడు. ...అబద్ధం చెప్తున్నావు... అని అంటాడు. అందుకు శకుంతల నిజం గొప్పతనాన్ని, నిజానికున్న విలువను, నిజాన్ని ఒప్పుకోవటంలో గల మనిషి నిజాయితీ గురించి రాజుకు వివరిస్తుంది.

 చ.  నుతజల పూరితంబు లగు నూతులు
నూఱిటికంటె సూనృత
వ్రత! యొక బావి మేలు: మఱి బావులు నూఱిటికంటె నొక్కస
త్ర్కతువది మేలు: తత్రతు శతంబునకంటె
సుతుండు మేలు: త
త్రుత శతంబుకంటె నొక సూనృత వాక్యము మేలు సూడగఁనే

క. వెలయంగ నశ్వమేథం బులు వేయును
నొక్క సత్యమును నిరుగడలం
దుల నిడి తూఁపఁగ సత్యము వలనన
ములుసూపు గౌరవంబున పేరిన్

తే. సర్వతీర్థాభిగమనంబు సర్వదేవ|
 సమధిగము సత్యంబుతో సరియుఁగావు 
ఎఱుఁగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద| యండ్రు 
సత్యంబు ధర్మజ్ఞులైన మునులు

అని వివరంగా నిజం ఎంత గొప్పదో శకుంతల వివరిస్తుంది.సత్యంగల ఓ మహారాజా! మంచినీటితో నిండిన సూరు చేద బావుల కంటే ఒక దిగుడు బావి మేలు. అలాంటి దిగుడు బావులు సూరిటీ కంటే ఒక మంచి యఙ్ఞం మేలు. అలాంటి నూరుయజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు. అలాంటి వంద పుత్రుల కంటే ఒక సత్యవాక్యం మేలు. తక్కె డలో ఒకవైపు నూరు అశ్వమేధయాగాల ఫలాన్ని, మరోవైపు నిజాన్ని ఉంచితే తక్కెడ ముల్లు నిజం వైపే మొగ్గుతుంది.

►ALSO READ | దీపావళి 2025 : ఎంప్లాయీస్ దివాళీ గిప్ట్స్ పై ఓ సంస్థ సర్వే .. ఎక్కువ మందికి క్యాష్బోనస్ కావాలంట..

 నిజమే అన్నిటి కంటే గొప్పదని చూపిస్తుంది. తీర్థాలను సేవించటం, వేదాలను అధ్యయనం చేయటం సైతం నిజం చెప్పడంతో సమానం కావు. ధర్మం తెలిసిన మునులు కూడా అన్ని ధర్మాల కంటే నిజమే ఉన్నతమైనదని చెప్తారు' అని నిండుసభలో శకుంతల అందరి. సమక్షంలో దుష్యంతుడికి చెప్పుంది.

నిజాలు... అబద్ధాలు

నేడు చీటికి మాటికి అబద్దాలు ఆడే వాళ్లు ఎక్కువై పోతున్నారు. నిద్రలేచింది మొదలు అబద్ధాల్లోనే బతికేస్తున్నారు. అబద్ధాలు ఆడకుండా ఉండటానికి మనమేమన్నా పై నుంచి దిగొచ్చామా అని సమర్ధించుకుంటున్నారు. అవసరాలు తీర్చుకో వటం, లాభాలు పొందటం, ఆస్తులు, డబ్బు సం పాదించడం, గొప్పలకు పోవటం... నిజాల్ని దాచే స్తున్నారు. అబద్ధం ఆడటం ఎంత తప్పో, నిజాన్ని చెప్పకపోవటం కూడా అంతే తప్పు. ఎదుటి వాళ్లు చెప్తున్న మాటల్లో నిజం ఏదో..! అబద్ధం ఏదో...! తేల్చుకోలేని స్థాయికి వచ్చేశారు.

మనసు అబద్దం చెప్పదు..

సమాజంలో మానవ సంబంధాలన్నీ డబ్బుకు, అధికారానికి దాసోహం అవు తున్నాయి. చెప్పిన మాట చెప్పలేదని బుకాయించేవాళ్లు ఎక్కువైపోతున్నారు. ఆధారాలను కూడా మార్చేస్తున్నారు. ఇక అబద్ధాలకు ఆధారాలు చూపిస్తూ మోసం చేస్తున్నారు. ఎవర్ని వాళ్లే మోసం చేసుకుంటూ నిజాలను దాచేస్తున్నారు. కానీ మనసు మాత్రం అబద్దం చెప్పదు. చేసిన తప్పును, ఆడిన అబద్ధాన్ని ఎప్పటి కప్పుడు గుర్తుచేస్తూనే ఉంటుంది. రోజూ కాలుస్తూనే ఉంటుంది. నిజం నిప్పులాం టిది. దాచినా, అబద్ధం ఆడినా వేధిస్తూనే ఉంటుంది.