కాలు బయటపెడితే చాలు.. కచ్చితంగా పాద రక్షలు.. అవేనండి చెప్పులతో పెడతారు. ఈ మధ్య కాలంలో కొంతమంది ఇంట్లో కూడా వాడుతున్నారనుకోండి. ఆధ్యాత్మిక ప్రదేశాలకు.. దేవాలయాలకు.. పెద్దల దగ్గరకు వెళితే చెప్పులను బయట వదిలేసి లోపలకు వెళతాము..ఇక గుళ్లకు వెళితే.. చెప్పులు వదిలిన తరువాత కచ్చితంగా కాళ్లు కడుక్కొని గుడికి వెళ్లే సంప్రదాయం ఉంది. ఇలా ఎందుకు చేయాలి.. ఒక్కోసారి గుడిలో స్వామిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు ముగించుకొని వచ్చేసరికి బయట ఉన్న చెప్పులు కాస్త మాయమవుతాయి. అంటే ఎవరో తీసుకెళతారు. అందుకే వెనకటి వారు చిత్తం.. శివుని మీద.. భక్తి చెప్పుల మీద అనే వారు. కాని పురాణాల ప్రకారం గుడి ప్రదేశంలో చెప్పులు అదృశ్యమైతే.. దరిద్రం పోయినట్టేనని మీ ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించి నట్టేనని పండితులు చెబుతున్నారు. అసలు గుళ్లో చెప్పులు పోవడానికి... లక్ష్మీదేవికి సంబంధం ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
భక్తితో గుడికి వెళతాము.. స్వామిని దర్శించుకుంటాం.. మొక్కులు చెల్లించుకొని మమ్ములను చల్లగా చూడమని.. కష్టాల బారి నుంచి కాపాడమని ప్రార్థించి.. కానుకలు సమర్పించి.. తీర్థ ప్రసాదాలు తీసుకొని బయటకు వస్తాం.. తరువాత మనం చెప్పుల కోసం ఎతుక్కుంటాం.. తీరా చూస్తే మన చెప్పులు పెట్టిన చోట కనపడవు.. ఎవరైనా పక్కన పెట్టారేమోనని చుట్టు పక్కల చేస్తాం.. ఎక్కడ ఉండవు. అంటే మన చెప్పులను ఎవరో తీసుకెళ్లారని నిర్దారణకు వస్తాం. ఇక అంతే పట్టలేనంత ఆగ్రహం..కోపం వస్తాయి. అక్కడున్న పెద్దలు ఎందుకంత కోపంగా ఉన్నావని ప్రశ్నిస్తే.. ఖరీదైన చెప్పులు పోయాయని చెపుతాం.. అప్పుడు వారు మీరు చాలా అదృష్ట వంతులు.. మీకు పట్టిన దరిద్రం పోయిందని చెబుతారు. దీని వెనుక ఉన్న ఆంతర్యాన్ని గమనిస్తే .. దేవాలయంలో చెప్పులు పోవడానికి జాతకానికి సంబంధం ఉందని పండితులు చెబుతున్నారు.
గుడిలో చెప్పులు పోవడం అనేది.. ఒక రకంగా ఫైనాన్స్ సమస్య అయినా .. ఆధ్యాత్మికంగా ఇది జీవితంలొ ఒక పాజిటివ్ సంకేతమని పండితులు చెబుతున్నారు. శని దోషం ఉన్నవారి చెప్పులు పోతే ఆ దోషం తగ్గుతుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తోంది.
శని గ్రహానికి చెప్పులకు సంబంధం: జ్యోతిష్య నిపుణులు తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం... పాదరక్షలు ( చెప్పులు) శని గ్రహానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే పితృ కార్యాలప్పుడు చెప్పులను దానం చేస్తారు. ఇక శని భగవానుడి దృష్టి వక్రంగా ఉన్నవారి చెప్పులు గుళ్లో పోతే.. శని ద్వారా వచ్చే కష్టాలు పోతాయని.. శని వదిలిపోయిందని అంటుంటారు.
నెగటివ్ ఎనర్జీ : సాధారణంగా దరిద్రాన్ని నెగిటివ్ ఎనర్జీ అంటారు. మనం రోజంతా ఎక్కడెక్కడో అనేక ప్రదేశాల్లో చెప్పులు వేసుకొని తిరుగుతుంటాం. బయట అన్ని రకాల మురికిని.. ఇతర పదార్ధాలను తెలిసో తెలియకో తొక్కుతాం. అంటే ప్రతి కూల శక్తి చెప్పులను గ్రహిస్తుంది. అందుకే గుడిలాంటి పవిత్ర ప్రదేశానికి వెళ్లే టప్పుడు చెప్పులు వదిలి.. కాళ్లను కడుక్కొని స్వామిని దర్శించుకుంటాం. మనకు ఇదంతా తెలియకపోయినా.. ఇలానే చేస్తాం కదా. అంటే మన వెంట ఉన్న దరిద్రాన్ని.. నెగిటివ్ ఎనర్జీని బయట వదిలి వెళతాం. ఎంతో పవిత్రంగా భావించే ప్రదేశంలో చెప్పులు పోతే మర దరిద్రం,, దురదృష్టం .. నెగిటివ్ ఎనర్జీని అక్కడే వదిలి స్వచ్చంగా ఇంటికి వెళతారని పెద్దలు చెబుతుంటారు. అందుకే గుళ్లో చెప్పులు పోతే కష్టాలనుంచి బయటపడేందుకు సమయం వచ్చిందని భావించాలంటున్నారు పండితులు.
►ALSO READ | Summer Health Tips : సమ్మర్ వచ్చేసింది.. వేడి జలుబు.. అతిసార వ్యాధులు దాడి చేస్తాయి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
గర్వం తొలగిపోవడం : కొంతమంది ఎంతో ఖరీదైన చెప్పులు వాడతారు. అంటే పాదరక్షలు సామాజిక హోదాను కూడా సూచిస్తాయి. భగవంతుని సన్నిధిలో అవి పోవడం అనేది మనలోని అహం..గర్వం తొలగిపోయిందని చెప్పేందుకు సంకేతమని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. అందుకే ఎంత ఖరీదైన చెప్పులు పోయినా .. ఇదంతా మన మంచికే జరిగిందని...సర్వం దైవకృప.. అని భావించడమే అసలైన భక్తి
శనివారం చెప్పులు పోతే: సాధరణంగా శనివారం.. శని దేవుడిని పూజిస్తాము. ఇక శనివారం చెప్పులు పోయాయంటే చాలా ప్రత్యేకమని పండితులు చెబుతున్నారు. శని దేవాలయంలో గాని ఇతర గుళ్లలో చెప్పులు పోతే, అది మీపై ఉన్న శని దేవుడి చెడు ప్రభావం తగ్గుతుందని చెప్పేందుకు సంకేతంగా భావిస్తారు. అందుకే కొంతమంది పాత చెప్పులను కావాలని శని దేవాలయాల వద్ద వదిలివేసే ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది.
చెప్పులు పోవడం వల్ల మనం ఖాళీ పాదాలతో ఇంటికి వెళ్తాము. ఇది భూమితో మనకు ప్రత్యక్ష సంబంధాన్ని కలిగిస్తుంది. భూమాత.. అంటే సాక్షాత్తు మహాలక్ష్మీ దేవి. ఇలా వెళ్లడం వలన దరిద్రాన్ని వదలి.. లక్ష్మీదేవిని ఇంటికి తీసుకెళ్లినట్టేనని పండితులు చెబుతున్నారు. సో.. దేవాలయంలో చెప్పులు పోతే బాధపడకండి.. మీకున్న చెడు ప్రభావం తొలగిపోయిందని భావించాలి. అందువలన దేవాలయంలో చెప్పులు పోతే.. ఎవరిని నిందించకండి..!
