హిందువులు పండుగలన్నీ అయితే చంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకొంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి అదే ముక్కోటి.... సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన తరువాత వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని వైభవంగా జరుపుకొంటారు.ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి.. స్వామిని దర్శించుకుంటే కోటి యఙ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పుణ్యతిథి గురించి మరిన్ని విశేషాలు…
పంచాంగం ప్రకారం.. 2025 వ సంవత్సరం చివరిలో అంటే డిసెంబర్ 30 వ తేది వచ్చింది. ఆ రోజున( డిసెంబర్ 30) ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకున్నారనిపురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చిందట.
అదే రోజు మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగించి, వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణుభగవానుడు. తమలాగే ఈరోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తరద్వారాన్ని నిర్మించి స్వామిని దర్శించుకుంటారో.. వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారట వారిరువురూ అప్పటినుంచీ ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది.
ముక్కోటి ఏకాదశినాడే వైకుంఠంలోని విష్ణుమూర్తివారి ఆంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి ‘వైకుంఠ ఏకాదశి’ అన్న పేరూ స్థిరపడింది. అందుకనే ఏకాదశి అంటేనే హిందువులకి పరమ పవిత్రమైన రోజు.
పూర్వం మురాసురుడనే రాక్షసుని సంహరించేందుకు, విష్ణుమూర్తి నుంచి ఒక అంశ వెలువడిందట. ఆమే ఏకాదశి అనే దేవత. ఏకాదశి సేవకు మెచ్చిన విష్ణుమూర్తి, తిథులలోకెల్లా ఏకాదశి గొప్ప తిథిగా ఎంచబడుతుందనీ, ఎవరైతే ఆ రోజు నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారనీ వరాన్ని ప్రసాదించాడు. అందుకనే ప్రతి ఏకాదశినాడూ మన పెద్దలు క్రమం తప్పకుండా ఉపవాసం చేసేవారు. దీని వల్ల ఏకాదశి ఫలం అనే పుణ్యమూ, ఆరోగ్యం రెండూ లభించేవి.
సూర్యడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ ధనుర్మాసంలోని ముక్కోటి ఏకాదశినాడు కనుక ఉపవాసం చేస్తే, మిగతా ఏకాదశి రోజులలన్నింటిలోనూ ఉపవాసం ఉన్నంత ఫలం దక్కుతుందని నమ్మకం. వైకుంఠ ఏకాదశినాడు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రత విధానం ప్రకారం దశమినాటి రాత్రి ( డిసెంబర్ 29) నుంచే ఉపవాసానికి ఉపక్రమించాలి.
ముఖ్యంగా ఏకాదశినాడు బియ్యంలో మురాసురుడు నివసిస్తాడని చెబుతారు. బియ్యంతో చేసిన ఆహారం పూర్తిగా నిషిద్ధం అని కరాఖండిగా చెప్పేందుకే ఈ మాట అని ఉంటారు. ఏకాదశినాడు కేవలం ఉపవాసం ఉండటమే కాదు. ధ్యానంతోనూ, జపతపాలతోనూ కాలం గడపమని సూచిస్తారు పెద్దలు. ఇక ఆ రాత్రి కూడా భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు అన్నారు కదాపెద్దలు. ఆ ఆకలి, నిద్రలు రెంటినీ తట్టుకుని, వాటిని అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి వ్రత విశిష్ఠత. ఇక మరునాడు ద్వాదశినాడు పేదలకు అన్నదానం చేసి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి.
వైకుంఠ ఏకాదశినాడు వైష్ణవాలయాల్లో ప్రత్యేకంగా తెరిచి ఉంచే వైకుంఠ ద్వారంగుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురుచూస్తారు. వైఖానసుడు అనే ఒక రాజు తన తండ్రిని నరకలోకం నుంచి తప్పించేందుకు ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించాడట. ఆతని వ్రత ఫలితంగా తండ్రి నరకం నుంచి విడుదలై స్వర్గలోకానికి చేరుకున్నాడట. అందుకని ఈ ఏకాదశికి మోక్షదా ఏకాదశి అనే పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు.
