ఇద్దరు పైలెట్ల లైసెన్సులు రద్దు చేసిన డీజీసీఏ

ఇద్దరు పైలెట్ల లైసెన్సులు రద్దు చేసిన డీజీసీఏ

రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు పైలెట్లపై డీజీసీఏ కొరడా ఝుళిపించింది. నిబంధనలను అతిక్రమించిన ఇద్దరు పైలెట్ల లెసెన్సులను డీజీసీఏ తాత్కాలికంగా రద్దు చేసింది. అందులో భాగంగా స్పైస్‌జెట్‌కు చెందిన ఓ క‌మాండ్ పైలెట్‌పై ఆరు నెల‌ల నిషేధం విధించింది. మేఘాల్లోకి వెళ్లొద్దని కో పైలెట్ వార్నింగ్ ఇచ్చినా క‌మాండ్ పైలెట్ ప‌ట్టించుకోలేద‌నే ఆరోపణల నేపథ్యంలో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మే 1 న ముంబై నుంచి దుర్గాపూర్ వెళ్తున్న విమానం తీవ్ర కుదుపునకు గురైంది. క‌మాండ్ పైలెట్ స‌రైన రీతిలో ఆ విమానాన్ని న‌డ‌ప‌లేక‌పోయారు. ఆ స‌మ‌యంలో విమానంలో సుమారు 195 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.

ఇక మ‌రో కేసులో ఓ చార్టర్ విమానానికి చెందిన పైలెట్ లైసెన్సును డీజీసీఏ స‌స్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నెల రోజుల పాటు లైసెన్సును నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. 2021 అక్టోబ‌ర్ 19న బొకారో నుంచి రాంచీ వెళ్తున్న విమానంలో ఇంధ‌నం లేద‌ని  అత్యవ‌స‌రంగా  ల్యాండ్ చేశారు. కానీ ఆ విమానంలో కావాల్సినంత ఇంధ‌నం ఉంద‌ని విచార‌ణ‌లో తేలడంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.