- పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో డీజీపీ సీవీ ఆనంద్ ప్రక్షాళన
- పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలకూ గ్రీన్‌సిగ్నల్
హైదరాబాద్, వెలుగు: డీజీపీగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచే ప్రక్షాళన మొదలుపెట్టారు. ఆకస్మిక తనిఖీల ద్వారా విధుల్లో నిర్లక్ష్యం, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులు, ఆఫీస్ స్టాఫ్ పై చర్యలు తీసుకుంటున్నారు.
అంతర్గత విచారణ అనంతరం బాధ్యులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. డీజీపీగా చార్జ్ తీసుకున్న తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే ఓ మహిళా అడిషనల్ ఎస్పీతో పాటు ఇద్దరు సెక్షన్ సూపరింటెండెంట్లు, ఓ సెక్షన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ను ఆయన సస్పెండ్ చేశారు.
మరికొంత మందిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయా హెచ్‌వోడీలతో నివేదికలు తెప్పించుకుంటున్నారు. అలాగే ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలకు డీజీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై ప్రస్తుత పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి నేతృత్వంలోని బృందం శుక్రవారం డీజీపీని కలిసి వినతిపత్రం అందజేసింది.
పరిపాలన, సాంకేతిక కారణాలతో ఎన్నికలు వాయిదా పడిన విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లింది. దీనిని పరిశీలించిన అనంతరం ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని డీజీపీ ఆదేశించారు. అసోసియేషన్ ప్రతినిధులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
