
- ప్రజలకు మర్యాద ఇవ్వాలి
- స్టేషన్‌కొచ్చి కంప్లైంట్ చేస్తే కేసు రిజిస్టర్ చేయాలి
- ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలు చేయాలి
- గంజాయి, డ్రగ్స్ కట్టడికి చర్యలు తీసుకోవాలి
- సీపీలు, ఎస్పీలకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ప్రజలతో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలని డీజీపీ జితేందర్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని తెలిపారు. ప్రజావాణిలో భాగంగా వచ్చే ఫిర్యాదులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
వెంటనే సమస్య పరిష్కరించి బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ జితేందర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్, ఇతర విభాగాల అడిషనల్ డీజీలతో కలిసి ఆయన మాట్లాడారు. ‘‘ప్రజా భద్రతకు భంగం కలిగించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలి.
డ్రగ్స్, గంజాయిని అరికట్టేందుకు మరిన్ని ప్రణాళికలు రూపొందించాలి. పోలీస్ స్టేషన్లకు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడాలి. వాళ్లిచ్చే ఫిర్యాదులపై వెంటనే కేసులు నమోదు చేసి విచారణ జరపాలి. సీపీలు, ఎస్పీలు తప్పనిసరిగా తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఆకస్మికంగా తనిఖీ చేయాలి’’అని అన్నారు.
-
రోడ్డు ప్రమాదాలు నివారించాలి
జిల్లాల వారీగా అన్ని పోలీస్ స్టేషన్లలో తనిఖీలు చేపడతానని డీజీపీ జితేందర్ వెల్లడించారు. హిస్టరీ షీట్లను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఆయుధాల లైసెన్స్‌ల జారీపై జాగ్రత్త వహించాలన్నారు.
లా అండ్ ఆర్డర్, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. నేను సైతం కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పనితీరును అంచనా వేసేందుకు క్రైమ్ రివ్యూ నిర్వహించాలన్నారు.