డీజీపీ, కుమ్రం భీమ్ జిల్లా ఎస్పీని మార్చాలి : ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

డీజీపీ, కుమ్రం భీమ్ జిల్లా ఎస్పీని మార్చాలి : ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు :  కుమ్రం  భీమ్  ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ బాబు అధికార పార్టీకి తొత్తుగా మారి పని చేస్తున్నారని, తక్షణమే ఆయనను ఎన్నికల విధుల నుంచి తొలగించి , బదిలీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం కాగజ్ నగర్ లోని పార్టీ ఆఫీసులో మాట్లాడారు. ఎస్పీ సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్పకు కొమ్ము కాస్తూ బీఎస్పీ నేత‌‌‌‌ల‌‌‌‌పై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఎస్పీ పర్యవేక్షణలో సిర్పూర్ నియోజకవర్గంలో, జిల్లాలో  ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే రాష్ట్ర డీజీపీతో పాటు ఎస్పీ సురేశ్​కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక బృందాన్ని పంపించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎస్పీ కాల్ డేటా వివరాలను బయటపెట్టాలన్నారు. స్థానిక నాయకులు బీఎస్పీలోకి రాకుండా పాత తేదీల్లో సంక్షేమ పథకాల ప్రొసీడింగ్స్ ఇస్తున్నారన్నారు.

దీనిపై కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. అంబులెన్స్ లలో డబ్బులు తరలించడానికే హెల్త్ డైరెక్టర్ గా గడల శ్రీనివాస్ రావు ను గుట్టు చప్పుడు కాకుండా నియమించారని ఆరోపించారు. ఏండ్లుగా ఇక్కడే పని చేస్తున్న పంచాయతీ రాజ్ ఏఈ లను, డీఈలను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, అసెంబ్లీ అధ్యక్షులు డోకే రాజన్న,జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రవీణ్, జిల్లా మహిళా కన్వీనర్ సిడెం జ్యోతి, ముస్తఫీజ్ హుస్సేన్, తన్నీరు పోచం,షబ్బీర్ హుస్సేన్, సీతానగర్ ఎంపీటీసీ జామున మహేష్, నక్క మనోహర్, సిద్ధం శ్రీనివాస్ పాల్గొన్నారు.