
హైదరాబాద్ : ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు. డీజీపీ కార్యాలయం నుంచి గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపిన ఆయన.. అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పని చేస్తున్నామన్నారు. ప్రధాన ప్రాంతాల్లో ఉన్నతస్థాయి అధికారులతో పర్యవేక్షణ జరుగుతుందని.. పోలీసు స్టేషన్లకు సీసీటీవీ కెమెరాలు అనుసంధానం చేశామన్నారు. వీలైనంత త్వరగా అన్నిచోట్ల నిమజ్జనం ముగిసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పది అడుగుల లోపు ఎత్తు ఉన్న విగ్రహాలను ఎన్టీఆర్, పీవీ మార్గ్ వైపు, పది అడుగుల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తరలిస్తున్నామని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.