
న్యూఢిల్లీ: రెండోసారి డోప్ పరీక్షలో పట్టుబడిన తమిళనాడు స్ప్రింటర్ ధనలక్ష్మి శేఖర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. జులై 27న పంజాబ్‌లోని సంగ్రూర్‌లో జరిగిన ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ మీట్‌లో సేకరించిన శాంపిల్స్‌లో నిషేధిత డ్రోస్టానోలోన్ ఉన్నట్లు తేలింది. దాంతో అధికారులు ఆమెపై తాత్కాలిక సస్పెన్షన్ విధించారు. జులై 2022లో అంటాల్యాలో వరల్డ్ అథ్లెటిక్స్, అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్.. ఔటాఫ్ కాంపిటీషన్‌లో భాగంగా సేకరించిన శాంపిల్స్‌లో ధనలక్ష్మి మెథాండియెనోన్‌ను వాడినట్లు తేలడంతో సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ ఈ ఏడాది జులై 17తో ముగిసింది. కానీ మళ్లీ పది రోజుల్లోనే ఆమె పాజిటివ్‌గా తేలింది.
నాడా క్రమశిక్షణ ప్యానెల్ విచారణ ముందు ఆమె స్టెరాయిడ్స్ వాడలేదని రుజువు చేసుకోకుంటే గరిష్టంగా ఎనిమిదేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది. ఒకవేళ అనుకోకుండా వాడినట్లుగా ఒప్పుకుంటే దానికి తగిన సాక్ష్యాలు చూపెట్టాల్సి ఉంటుంది. అప్పుడు పరిస్థితిని బట్టి నాడా చర్యలు తీసుకుంటుంది. డ్రోస్టానోలోన్ అనే శరీరం కండర బలాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. అదే టైమ్‌లో శరీరంలోని కొవ్వును కూడా గణనీయంగా కరిగిస్తుంది. అన్ని స్టెరాయిడ్ల మాదిరిగానే వరల్డ్ యాంటీ డోపింగ్ సంస్థ (వాడా) దీనిపై నిషేధం విధించింది.