గోదావరి కరకట్ట నిర్మాణ పనులు ప్రారంభించండి : దనసరి సీతక్క

గోదావరి కరకట్ట నిర్మాణ పనులు ప్రారంభించండి : దనసరి సీతక్క

మంగపేట, వెలుగు: ములుగు జిల్లా ఏటూరు నాగారం నుంచి మంగపేట మండలంలోని పొదుమూరు వరకు గోదావరి నది వరద ప్రవాహాన్ని తట్టుకునేలా కరకట్ట, వెంకటాపూర్ మండలం మారేడుగొండ చెరువు కట్ట నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. వరదలతో ప్రాణనష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం హైదారాబాద్ లో సచివాలయంలో నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు.

 ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. ఏటూరు నాగారం నుంచి రామన్నగూడెం ఎక్కల వరకు నిర్మించిన కట్ట మరమ్మతులు, తూముల రిపేర్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వెంకటాపూర్ మండలంలోని బూర్గుపేట మారేడుగొండ చెరువు కట్ట తెగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందని, యుద్ధ ప్రాతిపదికన టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కట్ట నిర్మాణ పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. సమీక్షలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలు, ఎస్సీలు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.