
- క్రేజీ కాంబో కుదిరింది
ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలతో మెప్పిస్తున్న ధనుష్, ‘జగమే తంత్రం’ మూవీతో నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమా విడుదలైన రోజునే తన కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ రావడం విశేషం. అది కూడా తెలుగు దర్శకుడితో. ఫీల్ గుడ్ చిత్రాలతో ప్రేక్షకుల మనసులు దోచుకునే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. శేఖరే ఈ ప్రాజెక్టుని స్వయంగా అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది తెరకెక్కనుంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల, ధనుష్ కలిసి నిర్మించనున్నారు. ధనుష్ తెలుగులో నటించనున్న ఫస్ట్ మూవీ ఇదే. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, షూటింగ్ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇక ధనుష్ హీరోగా ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మరోవైపు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల తీసిన 'లవ్ స్టోరీ' రిలీజ్‌కి రెడీ అవుతోంది. దాంతో త్వరలోనే ఈ మూవీ సెట్స్‌కి వెళ్లే అవకాశాలున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేసే ధనుష్‌తో కూల్ మూవీస్‌కి కేరాఫ్ అయిన శేఖర్ ఎలాంటి చిత్రం చేయబోతున్నాడో చూడాలి మరి.