Dhanush: తిరుమల శ్రీవారి సేవలో ధనుష్.. కుమారులతో కలిసి స్వామివారి దర్శనం.

Dhanush: తిరుమల శ్రీవారి సేవలో ధనుష్.. కుమారులతో కలిసి స్వామివారి దర్శనం.

తమిళ స్టార్ హీరో ధనుష్ బుధవారం ( జనవరి 28, 2026) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో ఆయనతో పాటు తన ఇద్దరు కుమారులు యాత్ర, లింగ కూడా ఉన్నారు.  సాధారణ భక్తుడిలా తన ఇద్దరు కుమారులతో కలిసి శ్రీవారిని  మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ పండితులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశ్వీరచనం ఇచ్చారు. 

నటుడు ధనుష్  ను చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ధనుష్ తో సెల్ఫీలు దిగడానికి అభిమానులు పోటీపడటంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. తన కుమారులతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ధనుష్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎంత బిజీగా ఉన్నా, తన వ్యక్తిగత జీవితానికి ,ఆధ్యాత్మికతకు ధనుష్ ఇచ్చే ప్రాధాన్యతను నెటిజన్లు అభినందిస్తున్నారు.

క్రేజీ ప్రాజెక్ట్ 'కారా'తో ఫుల్ బిజీ

ప్రస్తుతం ధనుష్,  దర్శకుడు విఘ్నేష్ రాజా దర్శకత్వంలో 'కారా' అనే పీరియడ్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమా 1990ల కాలం నాటి నేపథ్యంలో సాగుతుంది.  'కరాసామి' అనే యువకుడి ప్రయాణాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఇది భావోద్వేగాలతో కూడిన థ్రిల్లర్ మాత్రమే కాదు, ఇందులో మిస్టరీ ,  సస్పెన్స్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌లో ధనుష్ ఎంతో ఇంటెన్సివ్ లుక్‌లో కనిపిస్తున్నారు.

ఆ పోస్టర్‌పై ఉన్న "సమ్ టైమ్స్, స్టేయింగ్ డేంజరస్ ఈజ్ ది ఓన్లీ వే టు స్టే అలైవ్" అనే డైలాగ్ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో హింట్ ఇస్తోంది.  వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పతాకంపై డాక్టర్ ఇషారి కె. గణేష్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.  'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. వీరితో పాటు కేఎస్ రవికుమార్, జయరామ్, సూరజ్ వెంజరమూడు, కరుణాస్, పృథ్వీ పాండిరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.