రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించాడంటూ మహిళ ఆరోపించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఏడాదిన్నర పాటు తనను వాడుకొని వదిలేశాడంటూ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది బాధితురాలు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన బాధితురాలు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎన్నికల్లో గెలుపొందిన సమయంలో విషెస్ చెప్తూ.. టెలిగ్రామ్ యాప్ లో మెసేజ్ చేశానని.. ఆ రెండు, మూడు రోజులు బాగా మాట్లాడిన అరవ శ్రీధర్ తనను న్యూడ్ ఫోటోలు పంపమని అడగటం మొదలు పెట్టాడని చెప్పుకొచ్చింది.
తాను భర్తకు దూరంగా ఉంటున్నానన్న విషయం తెలుసుకున్న శ్రీధర్ లైంగికంగా వేధించడం స్టార్ట్ చేశాడని.. తన భర్తకు విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడని.. ఒప్పుకోకపోతే నీ ప్రమోహన్, ట్రాన్స్ఫర్ నా చేతిలోనే ఉన్నాయంటూ బెదిరించేవాడని అంటోంది బాధితురాలు. ఏడాదిన్నర పాటు తనను వాడుకున్న శ్రీధర్ ప్రెగ్నెంట్ అయ్యాక బెదిరించి అబార్షన్ చేయించాడని అంటోంది బాధితురాలు.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ కోసం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది పార్టీలో అధిష్టానం. వారం రోజుల్లోగా కమిటీ ముందు హాజరవ్వాలని శ్రీధర్ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని.. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్.
