ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరా నందన్ పేరుతో రూపొందించిన ఏఐ (Artificial Intelligence) ఆధారిత లవ్ స్టోరీ మూవీపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తన వ్యక్తిగత హక్కులు, గోప్యత ఉల్లంఘించబడ్డాయని పేర్కొంటూ అఖిరా నందన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది.
ఈ సినిమాలో తన ముఖం, స్వరం, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా AI మార్ఫింగ్, డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా అనుకరించారని అఖిరా నందన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా తన పేరుతో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ (X) వంటి సోషల్ మీడియా వేదికలపై నకిలీ ఖాతాలు సృష్టించడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ కేసును విచారించిన జస్టిస్ తుషార్ రావు నేతృత్వంలోని ధర్మాసనం, AI సాయంతో రూపొందించిన లవ్ స్టోరీ మూవీపై నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తి పేరు, రూపం, స్వరాన్ని డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా వాడటం దోపిడీకి సమానం అని కోర్టు వ్యాఖ్యానించింది. టెక్నాలజీని ఉపయోగించి కంటెంట్‌ను వక్రీకరించడం గోప్యత హక్కుల (ప్రతి వ్యక్తికి తమ వ్యక్తిగత సమాచారం) ఉల్లంఘన అని స్పష్టం చేసింది.
అదే సమయంలో, ఈ AI వీడియోకు సంబంధించి అఖిరా నందన్ పేరుతో ఉన్న, నకిలీ సోషల్ మీడియా ఖాతాలను తొలగించాలని మెటా, గూగుల్ (యూట్యూబ్), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మరియు ఎక్స్(X) సంస్థలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే సంబంధిత IP అడ్రస్ వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
ఈ పిటిషన్‌ను అఖిరా నందన్ తరఫున సీనియర్ అడ్వకేట్ దీపక్ దాఖలు చేయగా, గూగుల్ తరఫున ఆదిత్య గుప్తా, మెటా తరఫున వరుణ్ పాఠక్ వాదనలు వినిపించారు. ఈ తీర్పు దేశంలో AI, డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగంపై న్యాయవ్యవస్థ గట్టిగా స్పందించిన కీలక ఉదాహరణగా భావిస్తున్నారు.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా అకీరా నందన్‌కు సంబంధించినట్లు చూపిస్తూ అనుమతి లేకుండా తయారు చేసిన ఫొటోలు, వీడియోలు, ఇతర డిజిటల్ కంటెంట్ విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఇవి తన గోప్యతకు భంగం కలిగించడమే కాకుండా, వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనగా మారుతున్నాయని పిటిషన్‌లో అకీరా వెల్లడించారు.
ప్రత్యేకించి AI టెక్నాలజీని ఉపయోగించి తన రూపం, పేరుతో రూపొందిస్తున్న కంటెంట్‌ను వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ ప్రచారాన్ని నిలిపివేయాలని కోర్టును అకీరా నందన్ కోరారు. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్ములు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లపై తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని అకీరా నందన్ కోర్టుకు వివరించారు.
ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్‌లో కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు.‘AI లవ్ స్టోరీ’ పేరుతో రూపొందించిన ఈ ఏఐ ఆధారిత చిత్రాన్ని యూట్యూబ్‌లో వివిధ భాషల్లో అప్‌లోడ్ చేశారని పేర్కొన్నారు. ఇపుడు ఈ మూవీ సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ గా మారింది.
కోర్టు దృష్టికి వెళ్లిన వివరాల ప్రకారం, జనవరి 22, 2026 నాటికి ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు భాషా వెర్షన్‌కు 11,09,255 (11 లక్షలకు పైగా) వ్యూస్, ఇంగ్లీష్ వెర్షన్‌కు 24,354 వ్యూస్ వచ్చినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ స్థాయిలో వ్యూస్ రావడం వల్ల తన పేరును దుర్వినియోగం చేస్తూ ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు ఏర్పడే ప్రమాదం ఉందని అకీరా నందన్ కోర్టుకు తెలియజేశారు.
ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు తమ వ్యక్తిత్వ హక్కులు, గోప్యత హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏఐ జనరేటెడ్ కంటెంట్‌పై నియంత్రణలు తీసుకురావాలన్న డిమాండ్ పెరుగుతున్న తరుణంలో, కోర్టుల జోక్యం కీలకంగా మారుతోంది. ఇక ఈ లేటెస్ట్ తీర్పుతో మార్పు వస్తుందో, లేదో చూడాలి.
