క్రాప్​ లోన్లపై ధరణి ఎఫెక్ట్

క్రాప్​ లోన్లపై ధరణి ఎఫెక్ట్
  • టెక్నికల్ ప్రాబ్లమ్స్​ పరిష్కరించడంలో సర్కార్ విఫలం 
  • 2020-21లో రూ.53,222 కోట్లకు 36,030 కోట్లే ఇచ్చిన్రు
  • 60 లక్షల రైతులుంటే 30.62 లక్షల మందికే లోన్లు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకుల వైఫల్యంతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. కరోనా టైంలో క్రాప్​లోన్లు 10 శాతం అదనంగా ఇవ్వాలని కేంద్రం, ఆర్బీఐ స్పష్టం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రైతులు ప్రైవేట్​ వడ్డీ వ్యాపారులపైనే ఆధారపడక తప్పలేదు. 2020–21 ఖరీఫ్​, రబీ సీజన్లలో కలిపి రూ.53,222 కోట్లు టార్గెట్​ఉంటే కేవలం రూ.36 వేల కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. అంటే టార్గెట్​లో 67.70 శాతమే ఇచ్చారు. ఈ మేరకు సర్కార్​కు ఎస్ఎల్​బీసీ రిపోర్ట్​ పంపింది. బ్యాంకులు, సర్కార్​మధ్య ధరణి సమస్యతోనే ఈసారి లోన్లు తగ్గినట్లు తెలిసింది. టెక్నికల్​సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో సర్కార్​ వైఫ్యలం చెందగా, బ్యాంకులు కూడా కొన్ని విషయాల్లో మినహాయింపు ఇవ్వకపోవడంతో రైతులకు క్రాప్​లోన్లు అందలేదు. ఏ సర్వే నంబర్ లోని భూమికి ఎంత లోనుందో ఎమ్మార్వోలు చూడాలని, లోన్లున్న భూములను వేరేవాళ్లకు అమ్మి మ్యుటేషన్లు చేయకుండా అడ్డుకునే ఆప్షన్ ను బ్యాంకర్లు సూచించినా దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ధరణిలో బ్యాంకుల లాగిన్​లో కొన్ని ఆప్షన్లు ఇవ్వాలని కోరినా వాటిని పరిష్కరించలేదు. అలాగే కొత్త పట్టా పాసు పుస్తకాలు కూడా తనఖా పెట్టుకునే విషయంలోనూ గందరగోళం నడుస్తోంది. వీటి ప్రభావం లోన్ల పంపిణీపై తీవ్రంగా పడింది. 

ఐదేళ్లలో ఈసారే తక్కువ..
2020–21 ఖరీఫ్​లో రూ.31,936 కోట్ల టార్గెట్​ ఉంటే, రూ.22,935 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇక రబీలో రూ.21,286 కోట్లు ఇచ్చారు. ఎస్​ఎల్​బీసీ రిపోర్ట్ ​ప్రకారం గత ఐదేళ్లలో ఈసారే చాలా తక్కువగా క్రాప్​ లోన్లు ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులలో రెండు, మూడు మినహా ఏ బ్యాంకు కూడా ఇచ్చిన టార్గెట్​కు ప్రకారం క్రాప్​ లోన్లు ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పడిన ఏడాదిలో 2014–15లో 98.41 శాతం, 2015–16లో 84.17 శాతం, 2016–17లో 90.32 శాతం, 2017–18లో 79.02 శాతం, 2018–19లో 79.43 శాతం, 2019–20లో 76.41 శాతం లోన్లు ఇచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రుణాల పంపిణీ 50 శాతం కూడా దాటలేదు.

సగం మంది రైతులకే ఇచ్చిన్రు
ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది రైతులుండగా.. వారిలో సగం మందికే క్రాప్​లోన్లు అందినట్లు ఎస్ఎల్​బీసీ రిపోర్ట్​లో వెల్లడైంది. 2020–21 ఖరీఫ్​లో 20.41 లక్షల మందికి, రబీలో 10.21 లక్షల మందికి లోన్లు ఇచ్చినట్లు పేర్కొంది. ఇందులో కొత్త లోన్ల కంటే, రెన్యూవల్సే ఎక్కువగా ఉన్నాయని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.