ధరణి నిధులు మాయంచేసిన తహసీల్దార్ ఆఫీసులు

ధరణి నిధులు మాయంచేసిన తహసీల్దార్ ఆఫీసులు
  • ధరణి నిధులు మింగేశారు
  • ఒక్కో తహసీల్దార్ ఆఫీసుకు రూ.10 లక్షలు ఇచ్చిన సర్కార్
  • ఫర్నీచర్‌కు ఖర్చు చేయకుండానే నిధుల డ్రా
  • ధరణి పోర్టల్‌కు చేసిన ఖర్చులను వెల్లడించని సీసీఎల్ఏ
  • ఆర్టీఐ కింద అడిగితే హైపోథిటికల్ ప్రశ్నలంటూ దాటవేత

హైదరాబాద్, వెలుగు: భూరికార్డుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతులకు ఏ మేరకు ఉపయోగపడిందో కానీ.. తహసీల్దార్లు ఇతర ఆఫీసర్లకు మాత్రం జేబులు నింపింది. ధరణి సాఫ్ట్ వేర్ రూపకల్పన నుంచి తహసీల్దార్ ఆఫీసుల్లో పోర్టల్ నిర్వహణ వరకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు రాష్ట్రవ్యాప్తంగా పక్కదారిపట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్ ఫ్రాస్ట్రక్చర్, పోర్టల్ నిర్వహణ కోసం ఒక్కో ఆఫీసుకు రూ.10 లక్షలు మంజూరైతే అందులో లక్ష, రెండు లక్షలు కూడా ఖర్చు చేయకుండానే తహసీల్దార్లు ఇతర అధికారులు మొత్తం ఫండ్స్ ను డ్రా చేశారని తెలిసింది.ఇప్పటికే ఈ వ్యవహారంపై పలు మండలాలల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం.  

మొత్తం రూ.51.30 కోట్లు రిలీజ్
రాష్ట్రంలో 2020 అక్టోబర్ 29న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను ధరణి పోర్టల్ ద్వారా సీఎం కేసీఆర్ ప్రారంభించారు.ఈ పోర్టల్ ను ప్రారంభించడానికి ముందే తహసీల్దారు కార్యాలయాల్లో సాంకేతిక, మౌలిక వసతుల కల్పనకు ఒక్కో కార్యాలయానికి ప్రభుత్వం తొలుత రూ.9 లక్షలు కేటాయించింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 570 తహసీల్దార్  కార్యాలయాలకు కలిపి మొత్తం రూ. 51.30 కోట్లను విడుదల చేసింది. ఆ తర్వాత తహసీల్దార్ ఆఫీసుకో లక్ష చొప్పున మంజూరు చేసింది. ఇలా ఒక్కో ఆఫీసుకు రూ.10 లక్షలు విడుదలైతే కేవలం రెండు కంప్యూటర్లు, స్కానర్, ప్రింటర్, థంబ్, ఐరిష్ పరికరాలు, రెండు కంప్యూటర్ టేబుళ్లు కొనుగోలు చేసి మొత్తం నిధులు డ్రా చేసినట్లు తెలిసింది. మార్కెట్ లో రూ.3 లక్షలకు మించని ఈ వస్తువుల పేరిట రూ.10 లక్షల బిల్లులు డ్రా చేయడం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఆఫీసు మొత్తానికి కొత్తగా ఫర్నిచర్ ఇతర సౌకర్యాలను కల్పించాల్సి ఉండగా కేవలం తహసీల్దార్ చాంబర్లకు మెరుగులు దిద్దడానికే ఈ నిధులను వినియోగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ధరణి సాఫ్ట్ వేర్ లెక్కలు ఇస్తలేరు..
మరోవైపు ధరణి వెబ్ సైట్ కు అయిన ఖర్చు ఎంత? నిర్వహణకు ఎంత ఖర్చు చేస్తున్నారు ? కేటాయించిన బడ్జెట్ ఎంత ? అనే లెక్కలను కూడా అధికారులు చెప్పడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బోడు గ్రామానికి చెందిన గంగాధర కిశోర్ కుమార్ సమాచార హక్కు చట్టం కింద సీసీఎల్ఏకు దరఖాస్తు చేస్తే ఆఫీసు నుంచి విచిత్రమైన సమాధానమిచ్చారు. హైపోథిటికల్ ప్రశ్నలు ఉన్నాయని, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కుదరదంటూ రిప్లై ఇచ్చారు. రాష్ట్ర ప్రజలందరితో ముడిపడి ఉన్న ధరణి పోర్టల్ గురించిన సమాచారాన్ని దాపరికం లేకుండా తెలపాల్సి ఉండగా.. ఆ పోర్టల్ నిర్వహణను ఒక రహస్యంగా అధికారులు భావించడం అనుమానాలకు తావిస్తోంది.అంతేగాక ధరణి కోసం పనిచేస్తున్న సిబ్బంది, వారి జీత భత్యాలు, సీసీఎల్ఏకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్, సీసీఎల్ఏ సిబ్బంది జీతభత్యాలు, ల్యాండ్ మ్యాటర్ ఆప్షన్ తొలగించడానికి కారణాలను అడిగినా సీసీఎల్ఏ నుంచి ఎలాంటి సమాధానం లేదు.