వేతనాల వెతలు .. 15 నెలలుగా ధరణి ఆపరేటర్లకు అందని జీతాలు

వేతనాల వెతలు .. 15 నెలలుగా ధరణి ఆపరేటర్లకు అందని జీతాలు
  • ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు 

లింగంపేట, వెలుగు : తహసీల్దార్ కార్యాలయాల్లో పని చేస్తున్న ధరణి ఆపరేటర్లకు 15 నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 25 మంది ఆపరేటర్లు, ఒక డిస్ట్రిక్ట్​ కోఆర్డినేటర్​ విధులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, ఆన్​లైన్ రికార్డుల నమోదు, రైతుల వేలిముద్రల సేకరణ, సైట్ లో వివరాలు పొందుపర్చడం తదితర సేవలు అందిస్తున్నారు. 2018లో అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ (ఎప్​టీఎస్​) పేరిట ఓ ప్రైవేట్ ఏజన్సీ ద్వారా ఆపరేటర్లను నియమించింది. 

నాటి నుంచి ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వాలని కోరుతూ వస్తున్నారు. గతంలో రెండు, మూడు నెలలకు ఓసారి వేతనాలు అందేవి. ఫిబ్రవరి 2024 వరకు వేతనాలు అందాయి. బీటెక్, ఎంటెక్​ చదివిన నిరుద్యోగులు ఔట్ సోర్సింగ్ లో తక్కువ వేతనానికి ఎక్కువ పని చేస్తున్నామని, కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతున్నారు.

రెవెన్యూ మంత్రికి వినతి ..

15 నెలల వేతనాలు చెల్లించాలని ఇటీవల రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి  పొంగుటేటి శ్రీని వాస్​రెడ్డికి ఇటీవల వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్ ఏజన్సీని రద్దు చేసి కలెక్టర్ల ద్వారా వేతనాలు ఇవ్వాలని మంత్రిని కోరారు.   రూ.11 వేల జీతానికి బదులుగా నెలకు.రూ.31,040 ఇవ్వాలని వినతి పత్రంలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ధరణి స్థానంలో 'భూభారతి' ని అమలు చేస్తోంది. లింగంపేట మండలం పైలట్ ప్రాజెక్ట్​ కింద ఎంపిక కావడంతో  4225 దరఖాస్తులు రాగా, పనుల్లో నిమగ్నమయ్యారు.