పాత రిపోర్టులే పంపుతున్న ఎమ్మార్వోలు... 

పాత రిపోర్టులే పంపుతున్న ఎమ్మార్వోలు... 
  • ధరణి దరఖాస్తులు రిజెక్ట్
  • కారణం చెప్పకుండానే తిరస్కరణ
  • కొన్ని అప్లికేషన్లు చూస్తనేలేరు.. ఇంకొన్నింటికి ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తలేరు 
  • ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా సమస్య పరిష్కారం అయితలేదని రైతుల ఆవేదన 
  • ఒకే సమస్యపై మూడు సార్లకు పైగా 
  • అప్లై చేసుకున్నోళ్లు 34 వేలకు పైనే 
  • రెవెన్యూలో పైసలు ఇస్తేనే పనులు అవుతున్నాయనే ఆరోపణలు 


హైదరాబాద్, వెలుగు: ధరణి సమస్యలు తీరక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకే సమస్యపై ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా పరిష్కారం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ధరణిలో కొత్త మాడ్యూల్స్ తెచ్చామని, అప్లై చేసుకుంటే సమస్యలన్నీ పరిష్కరిస్తామని సర్కార్ చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. భూ సమస్యలపై ధరణిలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తుండగా, దాదాపు అన్నింటినీ రిజెక్ట్ చేస్తున్నారు. ఏవో కొన్నింటిని మాత్రమే పరిష్కరిస్తున్నారు. ఒక సమస్యపై పెట్టుకున్న దరఖాస్తు ఒకసారి రిజెక్ట్ అయినంక మళ్లీ అప్లై చేసుకున్నా తిరస్కరిస్తున్నారు. 

అలా ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా రిజెక్ట్ చేస్తున్నారు. అన్ని సరైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేసినా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. అసలు ఎందుకు రిజెక్టు చేస్తున్నారో కూడా కారణం చెప్పడం లేదని వాపోతున్నారు. రూ.వేలల్లో ఫీజు కట్టి మీసేవలో నాలుగైదు సార్లు అప్లై చేసుకుంటున్నామని, ప్రతిసారీ రిజెక్ట్ చేస్తుండడంతో వేలాది రూపాయలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పాత రిపోర్టులే పంపుతున్న ఎమ్మార్వోలు... 

ప్రస్తుతం ధరణిలో ఏదైనా సమస్యపై అప్లై చేసుకుంటే, అది నేరుగా కలెక్టర్ల లాగిన్ లోకి వెళ్తుంది. కలెక్టర్లు దాన్ని సంబంధిత ఎమ్మార్వోలకు పంపిస్తారు. ఆ సమస్యకు సంబంధించి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి, కలెక్టర్లకు ఎమ్మార్వోలు రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా ఆ సమస్యకు సంబంధించి ఉన్న పాత రిపోర్టులనే ఎమ్మార్వోలు పంపిస్తున్నారు. ఫీల్డ్ ఎంక్వైరీకి వెళ్లేందుకు స్టాఫ్ లేకపోవడం, పాత రికార్డులను పరిశీలించేందుకు ఆఫీసులోనూ సిబ్బంది లేకపోవడంతో గతంలో ఆ సమస్యపై ఇచ్చిన రిపోర్టునే మళ్లీ యథావిధిగా కలెక్టర్ కు పంపిస్తున్నారు. దీంతో అప్లికేషన్లు రిజెక్ట్ అవుతున్నాయి. ఇక కొన్ని దరఖాస్తులనైతే కనీసం చూడాకుండానే రిజెక్ట్ చేస్తున్నారని.. ఒకసారి తమ దరఖాస్తు గురించి అడిగిపోయినోళ్లు మళ్లీ రాకున్నా తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా తిరస్కరించడంతో ఒకే సమస్యపై మూడుసార్లకు పైగా దరఖాస్తు చేసుకున్న రైతుల సంఖ్య 34,428గా ఉందని అధికారులే చెబుతున్నారు. కాగా, ఎక్కువగా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలు, మిస్సింగ్ సర్వే నెంబర్లు, సర్కార్ భూములుగా నమోదైన పట్టా భూములు, మ్యుటేషన్లు, సక్సెషన్ల అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తున్నారు. పైగా ఒక దరఖాస్తును తిరస్కరిస్తే, అందుకు కారణం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి కారణాలు చెప్పకుండానే అప్లికేషన్లు రిజెక్టు చేస్తున్నారు.  

పైసలిస్తేనే పని! 

ధరణి లోపాలు ఆసరాగా కొందరు రెవెన్యూ అధికారులు వసూళ్లకు తెరలేపారని ఆరోపణలు ఉన్నాయి. అప్లికేషన్లపై పాజిటివ్ రిపోర్టు పంపాలంటే ఎంతోకొంత అడుగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్లికేషన్లు తరచూ రిజెక్ట్ అవుతుండడంతో బాధిత రైతులు.. కలెక్టర్, ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లి అడిగితే పైసలు ఇస్తేనే పని అవుతుందని సిబ్బంది అంటున్నారని తెలిసింది. పనిని బట్టి రూ.వేల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని సమాచారం. నాలుగు సార్లు అప్లై చేసినా రిజెక్ట్ చేసిన్రు.. గతంలో నేను ఎకరం భూమి కొన్న. మ్యుటేషన్ కోసం నాలుగు సార్లు అప్లై చేసుకున్నా రిజెక్ట్ చేసిన్రు. ప్రతిసారీ రూ.2,500 చొప్పున ఇప్పటి వరకు రూ.10 వేలు పోయినయ్. అసలు రిజెక్టు ఎందుకు చేస్తున్నారో కూడా కారణం చెప్పుతలేరు. 
- ఆనంద్, సంగారెడ్డి జిల్లా

పైసలు ఇస్తేనే పనైతదని అంటున్నరు 

నా రెండున్నర ఎకరాల భూమి ధరణిలో ఎక్కలేదు. ఇప్పటికి ఆరుసార్లు ధరణి పోర్టల్ లో అప్లై చేసుకున్న. నా దగ్గరున్న అన్ని డాక్యుమెంట్లు పెట్టిన. అయినా రిజెక్ట్ చేస్తున్రు. ఏమైనా ఇచ్చుకుంటేనే పనైతదని అంటున్నరు. న్యాయంగా జరగాల్సిన పనికి పైసలు ఎందుకు ఇయ్యాలె? ప్రభుత్వ ఉద్యోగినైన నా పరిస్థితే ఇట్లుంటే, మిగతా రైతుల పరిస్థితి ఏంటి?

- మహేందర్, మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా