అర్థరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు

అర్థరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు
  • అర్ధరాత్రి దాకా రిజిస్ట్రేషన్లు
  • రాష్ట్రవ్యాప్తంగా ఆఫీసుల్లో రద్దీ 
  • మళ్లీ డౌన్ అయిన ధరణి సర్వర్
  • కొత్త మార్కెట్ విలువల అమలుపై క్లారిటీ ఇవ్వని సర్కార్  

హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ఆస్తుల అమ్మకందారులు, కొనుగోలుదారులతో సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ ఆఫీసులు కిటకిటలాడాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి తెచ్చేందుకు సర్కార్ సన్నద్ధం కావడంతో పెరిగే భారం నుంచి తప్పించుకునేందుకు ముందస్తు రిజిస్ట్రేషన్లకు జనం క్యూ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రి 9 గంటల వరకు 9,618 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. హెచ్ఎండీఏ పరిధిలోని చాలా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. రిజిస్ట్రేషన్లతో పాటు ఈ–స్టాంప్స్ చలానాల చెల్లింపుల ద్వారా సర్కార్ కు రూ.97 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా, ధరణి పోర్టల్ లో సర్వర్ డౌన్ సమస్య మళ్లీ తలెత్తింది. చాలా తహసీల్దార్ ఆఫీసుల్లో 30 చొప్పున స్లాట్స్ బుక్ అయినప్పటికీ, సర్వర్ డౌన్ సమస్యతో 10 నుంచి 15 రిజిస్ట్రేషన్లు మాత్రమే పూర్తయ్యాయి. 

కొత్త మార్కెట్ విలువల అమలు.. ఎప్పటి నుంచి? 
ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రాబోతున్నట్లు రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు అనధికారికంగా చెప్తున్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదు. సవరించిన మార్కెట్ వాల్యూస్ నిరుడు జులై 22న అమల్లోకి రాగా, జులై 20న ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులిచ్చింది. 20, 21 తేదీల్లో ‘కార్డు’ సాఫ్ట్​వేర్ లో కొత్త విలువల అప్​డేషన్ జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి 1కి మరో రెండ్రోజులే సమయం ఉన్నప్పటికీ, శనివారం రాత్రి వరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదు. దీంతో సోమవారం రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు.