ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గోదావరి పరివాహక ప్రాంతాల ముంపు బాధితులు, పేదలకు ఇండ్ల స్థలాలు, డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చినా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు ఆరోపించారు. బూర్గంపహడ్​ మండలంలో 143 రోజులపాటు దీక్ష చేసిన ప్రజలు.. గురువారం కొత్తగూడెంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూర్గంపహడ్​ మండలంలో ప్రభుత్వ భూమిలో గోదావరి వరద ముంపు బాధితులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని ప్రజలు ఆందోళన చేస్తున్నా సర్కారు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా స్పందించకపోతే అసెంబ్లీకి పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. ప్రోగ్రాంలో నాయకులు మోరే రవి, సురేందర్​, నాగేశ్వరరావు, కృష్ణ, భద్రమ్మ, భవాని, లక్ష్మీ, నాగన్నతదితరులు పాల్గొన్నారు. 

సోషల్​ సర్వీస్​ చేయడం అభినందనీయం 

కల్లూరు, వెలుగు: తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోషల్​సర్వీస్​ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కల్లూరు మేజర్ పంచాయతీ ఆఫీసులో గురువారం తానా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు కిట్లు, ల్యాప్ టాప్, వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలు, రైతులకు తానా ఫౌండేషన్ సేవలు అందిస్తోందన్నారు. అనంతరం తానా ఫౌండేషన్ నిర్వాహకుడు యార్లగడ్డ వెంకటరమణను సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవెల్లి రఘు, జడ్పీటీసీ అజయ్ కుమార్, బీఆర్ఎస్ లీడర్లు రామారావు, రఘు, నాయకులు పాల్గొన్నారు.

గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని వినతి 

గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామ దీపికలు ఎమ్మెల్యే వెంకటవీరయ్యకు వినతిపత్రం అందజేశారు. కల్లూరులోని పంచాయతీ ఆఫీసులో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరుకాగా... ఆయనను కలిసి గ్రామదీపికలు తమ సమస్యలు వివరించారు. తమకు ప్రతినెలా వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. గ్రామ దీపికల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. 
కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు రాంబాబు, గ్రామ దీపికల  సంఘం నాయకులు శ్రీదేవి శివనాగలక్ష్మి , సాహిదా బేగం, సునీత, ఫాతిమా 
పాల్గొన్నారు.

కంటి వెలుగులో భద్రాద్రి ఫస్ట్​ ప్లేస్‌లో ఉండాలి 

భద్రాద్రికొత్తగూడెం, పాల్వంచ, వెలుగు : కంటి వెలుగు ప్రోగ్రాంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా రాష్ట్రంలోనే  ఫస్ట్​ప్లేస్‌లో ఉండాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ అన్నారు. కొత్తగూడెంలో కలెక్టర్​ అనుదీప్​ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో  గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 18న కంటి వెలుగు ప్రారంభం అవుతుందన్నారు. జిల్లాలో 18 ఏండ్లు నిండిన వారు 7.90లక్షల మంది  ఉన్నారని, వీరందరికీ పరీక్షలు చేసేందుకు 48 టీంలను ఏర్పాటు చేశామన్నారు. పాల్వంచలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్​ ప్రారంభించనున్నారని తెలిపారు. అనంతరం పాల్వంచ పట్టణంలో రూ.5.40కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు రూ5.కోట్లతో రహదారి విస్తరణ, కరెంట్​స్తంభాల పునరుద్ధరణ, 4వే, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించారు. రూ.41 లక్షలతో చేపట్టనున్న బస్టాండ్​రిపేర్, టాయిలెట్స్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాల్వంచ బస్టాండ్‌లో కొత్త సూపర్​లగ్జరీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే వనమా నివాసంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానోత్​ హరిప్రియ, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, డీసీసీబీ చైర్మన్​ కూరాకుల నాగభూషణం, జడ్పీ వైస్​ చైర్మన్​ కె.చంద్రశేఖర్​, అడిషనల్​ కలెక్టర్​ కె.వెంకటేశ్వర్లు, లైబ్రరీ సంస్థ చైర్మన్​ డి.రాజేందర్, కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపల్​ చైర్మన్లు కె. సీతాలక్ష్మి, డి.వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌వో శిరీష పాల్గొన్నారు.  

జేపీఎస్‌ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా

ములకలపల్లి, వెలుగు: జూనియర్ పంచాయతీ  కార్యదర్శుల రెగ్యులరైజేషన్​ ఇష్యూను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.  గురువారం ములకలపల్లి లోని  రైతు వేదిక వద్ద 64 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్  చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఇప్పటివరకు రూ11.66 కోట్లు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని ప్రతిఒక్కరూ గుర్తుంచుకొని రానున్న రోజుల్లో బీఆర్ఎస్‌ను ఆదరించాలన్నారు. అనంతరం దళిత బంధు కింద మంజూరైన  కారును ప్రారంభించి లబ్ధిదారునికి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగమణి, తహసీల్దార్​వీరభద్రం, ఎంపీడీవో నాగేశ్వరరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు అప్పారావు, లీడర్లు అమర్నాథ్, మంగపతి,  చందర్రావు, రాజారావు పాల్గొన్నారు. 

భూ సేకరణను స్పీడప్ చేయాలి

ఖమ్మం టౌన్, వెలుగు: కొండపల్లి (విజయవాడ) నుంచి కాజీపేట సెక్షన్ వరకు 3వ రైల్వే లైన్ విద్యుద్దీకరణకు ఖమ్మం జిల్లాలో అవసరమయ్యే భూ సేకరణను స్పీడప్​చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు.  గురువారం ఖమ్మం అర్బన్ మండలం 3వ రైల్వే లైన్ భూ సేకరణ ఏరియాలో అధికారులతో కలిసి పర్యటించారు. నగరంలోని నర్తకి థియేటర్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, సారథి నగర్, బుర్హాన్‌పురం తదితర ప్రాంతాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, కామేపల్లి మండలాలకు చెందిన 30 గ్రామాల నుంచి 117.19 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉందన్నారు. ఖమ్మం అర్బన్ మండలంలో సుమారు 1.10 ఎకరాలు, బుర్హాన్​పురంలో 1.16 ఎకరాల సేకరించాల్సి ఉందన్నారు. కలెక్టర్​వెంట ఆర్డీవో రవీంద్రనాథ్, మున్సిపల్​ఈఈ కృష్ణలాల్, రైల్వే డివిజనల్ ఇంజనీర్ టి.సూర్యనారాయణ, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, ఇతర అధికారులు ఉన్నారు.

ఫైనల్​ ఓటరు జాబితా పూర్తి 

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లా ఫైనల్​ఓటరు జాబితా పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో  11,53,987 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఇందులో 5,62,623 మంది పురుష, 5,91,290 మంది స్త్రీ, 74 మంది థర్డ్ జెండర్లు, ఎన్ఆర్ఐ ఓటర్లు 143, సర్వీస్ ఓటర్లు 680 మంది ఉన్నట్లు తెలిపారు. ఎస్ఎస్ఆర్-2023  సందర్భంగా 37,193 మంది ఓటర్లను చేర్చగా, 8,027 మంది తొలగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తుది ఓటర్ల జాబితా హార్డ్, సాఫ్ట్ కాపీలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అదనపు కలెక్టర్ అందజేశారు. సమావేశంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, వివిధ పార్టీల ప్రతినిధులు బి.ఉపేంద్ర సాహు, జి.విద్యాసాగర్, ఎస్.నర్సింహారావు, ఆర్.ప్రకాశ్, ఎస్ఎం హుస్సేన్, వి.విజయ్, కృష్ణ చైతన్య, టి.కృష్ణ మోహన్ పాల్గొన్నారు.