DHFLడిపాజిట్లు నిలిపివేత

DHFLడిపాజిట్లు నిలిపివేత

నిధుల కొరత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌‌ (డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌) కాల పరిమితి పూర్తికాని డిపాజిట్ల విత్‌‌డ్రాయల్స్‌‌పై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాక కొత్త డిపాజిట్లను అంగీకరించ కూడదని, పాత డిపాజిట్లను రెన్యూవల్ చేయకూడదని కూడా నిర్ణయం తీసుకున్నట్టు డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ పేర్కొంది. దీంతో బుధవారం ప్రారంభంలోనే డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ షేర్లు భారీగా కుదేలయ్యాయి. సుమారు 18 శాతం మేర ఈ షేర్లు పడిపోయాయి. చివరికి 9.85 శాతం నష్టంలో రూ.117.10 వద్ద క్లోజైంది. తమ ఫిక్స్‌‌డ్ డిపాజిట్ ప్రొగ్రామ్‌‌ క్రెడిట్ రేటింగ్‌‌ను సమీక్షించిన డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌, తక్షణమే అన్ని తాజా డిపాజిట్లను, రెన్యూవల్స్‌‌ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కాల పరిమితి పూర్తికాని డిపాజిట్ల విత్‌‌డ్రాయల్స్‌‌ను కూడా ప్రస్తుతం ఆపివేస్తున్నట్టు తెలిపింది. ఈ చర్యలు తమ అప్పుల నిర్వహణను గుర్తించడానికి దోహదం చేస్తాయని డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌కు చెందిన సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇవి పూర్తిగా నేషనల్ హౌజింగ్ బ్యాంక్‌‌(ఎన్‌‌హెచ్‌‌బీ) రెగ్యులేషన్స్‌‌ కిందకే వస్తాయని పేర్కొన్నాయి. ఎన్‌‌హెచ్‌‌బీ నిబంధనల ప్రకారం.. ఎవరికైతే ఇన్వెస్ట్‌‌మెంట్ గ్రేడ్ రేటింగ్‌‌ ఉండదో, ఆ కంపెనీలు డిపాజిట్లు స్వీకరించడానికి అనుమతి ఉండదు. కేవలం మెడికల్ లేదా ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే కాల పరిమితి పూర్తి కానీ డిపాజిట్ల విత్‌‌డ్రాయల్స్‌‌ చేపట్టుకోవచ్చని డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ వర్గాలు పేర్కొన్నాయి. దీని కోసం కస్టమర్లు వాలిడ్ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. గత కొన్ని వారాలుగా డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ విశ్వసనీయతపై మార్కెట్లో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ కంపెనీ అన్ని అప్పులను తిరిగి చెల్లించడానికే పూర్తిగా కట్టుబడి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2018 సెప్టెంబర్ నుంచి కంపెనీ సుమారు రూ.30 వేల కోట్ల అప్పులను క్లియర్ చేసిందని పేర్కొన్నాయి. గత ఎనిమిది నెలల కాలంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలు(ఎన్‌‌బీఎఫ్‌‌సీలు) తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఐఎల్‌‌ఎఫ్‌‌ఎస్ గ్రూప్ కంపెనీలు దివాళా తీయడంతో ఎన్‌‌బీఎఫ్‌‌సీలకు ఈ పరిస్థితి ఏర్పడింది. కంపెనీ క్రెడిట్ ప్రొఫైల్‌‌ను బలహీనపరిచేలా మార్కెట్‌‌లో వస్తోన్న ఊహాగానాలపై డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ ఈ నెల 10నే క్లారిటీ ఇచ్చింది. ఇండస్ట్రీలో వ్యాపార కార్యకలాపాలు కాస్త నెమ్మదించడం, డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ రుణాల చెల్లింపు సామర్థ్యంపై లేదా లోన్‌‌ సర్వీసింగ్‌‌పై పడదని కంపెనీ స్పష్టం చేసింది.