
పుణె: కెప్టెన్సీ వల్ల సహజంగానే వచ్చే ఒత్తిడి, అంచనాలు రవీంద్ర జడేజా ఆటను ప్రభావితం చేశాయని చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. జట్టు పగ్గాలు అందుకోవాల్సి ఉంటుందని జడ్డూకు గత సీజన్‌లోనే తెలిసినా అందుకు సన్నద్ధం కాలేకపోయాడని చెప్పాడు. కెప్టెన్సీ భారం వల్ల ఫామ్ కోల్పోయిన జడేజా ఫీల్డింగ్‌లోనూ తడబడ్డాడని, తమ జట్టు ఓ అద్భుతమైన ఫీల్డర్‌ను కోల్పోయిందన్నాడు. ఈ సీజన్ ఆరంభానికి ముందు ధోనీ నుంచి సీఎస్‌కే కెప్టెన్సీ అందుకున్న జడేజా లీడర్‌గా, ప్లేయర్‌గా నిరాశ పరిచాడు. దాంతో, ఎనిమిది మ్యాచ్‌ల తర్వాత మళ్లీ ధోనీకే పగ్గాలు అప్పగించారు. ఆదివారం సన్ రైజర్స్‌తో పోరులో చెన్నైని గెలిపించిన తర్వాత కెప్టెన్సీ మార్పు గురించి ధోనీ మాట్లాడాడు.
‘ఈ ఏడాది సీఎస్‌కే కెప్టెన్సీ చేపట్టాలని జడేజాకు గత సీజన్‌లోనే తెలుసు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనే నేను కొంచెం సాయం చేసి తర్వాత అంతా తనకే వదిలేశా. తను సొంతంగా నిర్ణయాలు తీసుకొని వాటికి బాధ్యత వహించేలా చూశా. కెప్టెన్ అయిన తర్వాత సహజంగానే చాలా డిమాండ్లు వస్తాయి. కానీ, అంచనాలు పెరగడం జడేజా మైండ్‌సెట్‌ను ప్రభావితం చేసింది. కెప్టెన్సీ భారం అతని ప్రిపరేషన్స్, పెర్ఫామెన్స్‌ను దెబ్బ తీసిందని అనుకుంటున్నా’ అని ధోనీ పేర్కొన్నాడు. నాయకత్వానికి సిద్ధం అవ్వడానికి తగిన సమయం దొరికినా జడేజా సద్వినియోగం చేసుకోలేకపోయాడని అభిప్రాయపడ్డాడు. ఒకసారి కెప్టెన్ అయ్యాక సొంత ఆటతో పాటు అన్నింటికీ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నాడు. ఇప్పుడు కెప్టెన్సీ భారం తొలగిపోవడంతో జడ్డూ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని మహీ ఆశాభావం వ్యక్తం చేశాడు.