హృతిక్ రోషన్‌ అనుకున్నాడు.. మ్యూజియంలో బంగారాన్ని కొట్టేసి పారిపోతూ..

హృతిక్ రోషన్‌ అనుకున్నాడు.. మ్యూజియంలో బంగారాన్ని కొట్టేసి పారిపోతూ..

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన 'ధూమ్' చూశారుగా..! చూసే ఉంటారులే. ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఆ రేంజ్‌లో ఉంటాయి మరి. ముఖ్యంగా హృతిక్ రోషన్ దొంగతనం చేసి తప్పించుకునే సన్నివేశాలు ఔరా అనిపిస్తుంటాయి. సందర్భానికి తగ్గటు గెటప్ మారుస్తూ.. పోలీస్ అధికారైన అభిషేక్ బచ్చన్‌ను బురిడీ కొట్టిస్తుంటాడు. అచ్చం అదే తరహాలో ఓ దొంగ భోపాల్‌ స్టేట్ మ్యూజియం నిర్వాహకులను తప్పుదారి పట్టించి రూ.15 కోట్ల విలువైన బంగారాన్ని దొంగలించాడు. 

టికెట్ కొని దర్జాగా ఎంట్రీ

వృత్తిరీత్యా దొంగ అయిన వినోద్ యాదవ్‌ అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం సమయంలో భోపాల్‌ స్టేట్ మ్యూజియంలోకి ప్రవేశించాడు. టికెట్ తీసుకొని దర్జాగా మెయిన్ గేట్ నుంచి లోనికి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, మ్యూజియం మూసివేసే సమయంలో అతను బయటకు వెళ్లలేదు. లోపలే దాక్కున్నాడు. అందరూ వెళ్లిపోయారనుకున్న నిర్వాహకులు ఎప్పటిలానే మ్యూజియానికి తాళాలు వేశారు.

దాదాపు 40 గంటలు లోపలే

ఆదివారం అర్ధరాత్రి నిశ్శబ్ద సమయంలో దొంగ వచ్చిన పని కానిచ్చాడు. మ్యూజియంలో ఉన్నటువంటి పురాతన బంగారు నాణేలు, నగలు, అమూల్యమైన కళాఖండాలు అన్నీ సర్ధేశాడు. సోమవారం సెలవు కావడంతో మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో మ్యూజియం తరుపులు తెరిచిన అధికారులకు లోపల అన్నీ చిందరవందరగా పడిన దృశ్యాలు కనిపించాయి. బంగారు నాణేలు, నగలు, అమూల్యమైన కళాఖండాలన్నీ మాయమైనట్లు గుర్తించారు. 

23 అడుగుల ఎత్తైన గోడ

అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే మ్యూజియం ప్రాంగణమంతా వెతకడం ప్రారంభించారు. ఆ సమయంలో వారికి హాలులో అపస్మారక స్థితిలో పడి ఉన్న దొంగ(వినోద్ యాదవ్) తారసపడ్డాడు. అతని పక్కనే పెద్ద బ్యాగ్ కూడా ఉంది. అందులో గుప్తుల కాలం నాటి బంగారు నాణేలు, నగలు, పాత్రలతో పాటు బ్రిటీష్, నవాబుల కాలానికి చెందిన ఇతర వస్తువులు ఉన్నాయి. దొంగతనం అనంతరం తప్పించుకునే ప్రయత్నంలో 23 అడుగుల ఎత్తైన గోడ నుండి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో, అక్కడినుండి బయటపడలేకపోయాడు.

నిందితుడు గోడ దూకే సమయంలో కింద పడి గాయపడటంతో బయటకు వెళ్లలేకపోయినట్లు డీసీపీ రియాజ్ ఇక్బాల్ తెలిపారు. నిందితుడు గతంలోనూ ఒకసారి లోనికి వచ్చినట్లు వెల్లడించారు. అలారం వ్యవస్థ లేకపోవడం, లోపలున్న సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం నిందుతునికి ముందే తెలుసనీ పేర్కొన్నారు.