ఖమ్మం టౌన్/కామేపల్లి/కల్లూరు,వెలుగు : మానవ జీవనశైలిలో స్వల్ప మార్పులతో మధుమేహం నియంత్రణ సాధ్యమవుతుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ లో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా మధుమేహం - ఆరోగ్యకరమైన జీవన శైలిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ షుగర్ ను నిర్లక్ష్యం చేస్తే గుండె సంబంధిత వ్యాధులు, కిడ్ని ఫెయిల్యూర్ లాంటి తీవ్రమైన సమస్యలు వస్తాయన్నారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ మధుమేహం వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు.
అంతకుముందు ఎస్ఆర్ గార్డెన్స్ నుంచి కలెక్టరేట్ వరకు మధుమేహ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. కామేపల్లి, కల్లూరులో కూడా స్థానిక డాక్టర్లు, అధికారులు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కలెక్టరేట్ లో ఇందిరా మహిళా డెయిరీ రెండవ విడత లబ్ధిదారుల ఎంపిక, నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
భవిష్యత్లో 5 వేల మంది లబ్ధిదారులకు 2 పశువుల చొప్పున 10 వేల పశువులు పంపిణీ చేసే నేపథ్యంలో దానికి అనుగుణంగా పాల కొనుగోలు, విక్రయం లాంటి పనులను పర్యవేక్షించేందుకు కట్టుదిట్టమైన మేనేజ్మెంట్ సిద్ధం చేయాలన్నారు
