రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ సమస్య

రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ సమస్య
  • రాష్ట్రవ్యాప్తంగా కొరత.. రోజురోజుకు పెరుగుతున్న సమస్య
  • 50 శాతం తగ్గిన సప్లయ్.. తిప్పలు పడుతున్న జనం
  • నష్టాల సాకుతో బంకులు అడిగినంత ఇవ్వని ఆయిల్ కంపెనీలు
  • సరఫరాను భారీగా తగ్గించిన బీపీసీఎల్‌‌.. తర్వాతి స్థానాల్లో హెచ్‌‌పీ, ఐఓసీ
  • సీజన్ కావడంతో ఎవుసం పనులకు ఇబ్బందులు
  • కిలోమీటర్ల దూరం వెళ్లి డీజిల్ తెచ్చుకుంటున్నరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డీజిల్ కొరత పెరిగిపోతున్నది. మొన్నటిదాకా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులకే పరిమితమైన ‘నో స్టాక్’ బోర్డులు ఇప్పుడు జిల్లాలు, మండల కేంద్రాల్లోనూ కనిపిస్తున్నాయి. పెట్రోల్ ఎక్కడో ఒక చోట దొరుకుతున్నా.. డీజిల్ కోసం మాత్రం అవస్థలు పడాల్సి వస్తోంది. వ్యవసాయ పనులు మొదలైన సమయంలో ఇలా కొరత ఏర్పడటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన దానికంటే 50 శాతం దాకా డీజిల్ షార్టేజ్ ఉన్నట్లు డీలర్లు చెబుతున్నారు. ఇండెంట్ పెడుతున్నా.. అందులో సగం వరకే సప్లై చేస్తున్నారని అంటున్నారు. తమకు డీజిల్‌‌పై లీటరుకు రూ.25, పెట్రోల్ మీద రూ.18 వరకు నష్టం వస్తోందని చెబుతున్న కంపెనీలు.. డీజిల్ సప్లయ్‌‌ని మరింతగా తగ్గించేస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే మరింత క్రైసిస్ వచ్చే ప్రమాదం ఉంది.

ఆర్టీసీ, ఇతర ఇండస్ట్రీల వల్ల కూడా కొరత

కొన్ని ఆయిల్ కంపెనీలు అమ్మకాలు పెంచుకునేందుకు గతంలో పెట్రోల్, డీజిల్‌‌ను డీలర్లకు సప్లయ్ చేసేవి. డీలర్లు వాటిని సేల్ చేశాక కంపెనీలకు డబ్బులు చెల్లించేవాళ్లు. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్‌‌లో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగితే అందుకు అనుగుణంగా రేట్లు పెంచుకునేందుకు కేంద్రం అనుమతించడం లేదు. దీంతో పెట్రోలు, డీజిల్‌‌ సప్లయ్‌‌తో నష్టాలు పెరుగుతున్నాయని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. అందుకే అడిగినంత ఇవ్వకుండా కోత పెడుతున్నాయని డీలర్లు చెప్తున్నారు. అడ్వాన్స్‌‌ ముందే ఇస్తే కానీ ట్యాంకర్లకు డీజిల్‌‌ ఇవ్వడం లేదని, రెండు రోజులు ముందే డబ్బులు కట్టించుకుంటున్నారని పేర్కొంటున్నారు. మధ్యలో బ్యాంకు సెలవులు వస్తే రెండు, మూడు రోజులు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. డబ్బులు డిపాజిట్ చేశాకే ఆయిల్ కంపెనీలు ట్యాంకులను పంపిస్తున్నాయి. దీంతో పెద్ద మొత్తంలో ముందే చెల్లించకలేక కొద్దికొద్దిగా తెప్పించుకుంటున్నారు. ఒకవేళ పెద్ద మొత్తంలో చెల్లించి ఇండెంట్ పెట్టుకున్నా.. అందులోనూ సగం లోపే సప్లయ్ చేయిస్తున్నాయి. ఆయిల్ కంపెనీలు వాటికి డైరెక్ట్‌‌గా పెట్రోల్, డీజిల్ సప్లయ్ చేస్తాయి. పెరిగిన రేట్లకు అనుగుణంగా ఆర్టీసీ, రైల్వేలకు డీజిల్‌‌ రేట్లను కంపెనీలు పెంచాయి. దీంతో ఆర్టీసీ, పెద్ద ఇండస్ట్రీలు తమ పెట్రోల్ బంకుల్లో కాకుండా బయట బంకుల్లో డీజిల్ కొట్టిస్తున్నాయి. దీనివల్ల కూడా మరింత షార్టేజీ వస్తున్నట్లు తెలిసింది.

30 శాతం బంకుల్లో షార్టేజ్

రాష్ట్రంలో వివిధ ఆయిల్‌‌ కంపెనీల నుంచి బంక్‌‌లకు రోజూ సుమారు కోటి లీటర్ల డీజిల్‌‌, 40 లక్షల లీటర్ల పెట్రోల్‌‌ సప్లయ్ అవుతున్నది. సాధారణంగా ఈ టైంలో ఇది మరింతగా పెరుగుతుంది. డీజిల్ కోటి 15 లక్షలు, పెట్రోల్ 50 లక్షల లీటర్ల దాకా అవసరం అవుతుంది. కానీ ఇందులో 70  శాతం లోపే బంకులకు సప్లయ్ అవుతున్నది. బంకులకు రోజువారీగా చేసే సరఫరాలో బీపీసీఎల్‌‌ నుంచి షార్టేజ్ ఉంటున్నదని డీలర్లు చెబుతున్నారు. తర్వాత స్థానాల్లో హెచ్‌‌పీ, ఐఓసీ కంపెనీలు ఉన్నాయని పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్రంలోని బంకుల్లో పెట్రోల్‌‌ కూడా సరిపోవడంలేదు. వచ్చిన కొద్ది పెట్రోల్‌‌, డీజిల్‌‌ కొన్ని గంటల్లోనే అమ్ముడవుతున్నది. బంక్‌‌ నిర్వాహకులు నో స్టాక్‌‌ బోర్డులు పెడుతున్నారు. రాష్ట్రంలోని 20 నుంచి 30 శాతం బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

ఎవుసం, రవాణాపై ఎఫెక్ట్

వానాకాలం సీజన్ కావడంతో డీజిల్ కొరత రైతులను వేధిస్తున్నది. దుక్కులు సిద్ధం చేసుకునేందుకు అందరూ ట్రాక్టర్లనే వాడుతున్నారు. ఇప్పుడు కీలకమైన టైంలో డీజిల్ దొరక్క దున్నుకాలు, విత్తనాలు ఆలస్యమైతున్నయి. మబ్బులనే నాలుగైదు గంటలకు బంకులకు పోయి డీజిల్ కోసం పడిగాపులు పడుతున్నరు. వేరే ఎక్కడో బంకులో ఉందని తెలిస్తే ఎంత దూరం అయినా సరే పోయి తెచ్చుకుంటున్నరు. దీంతో కొన్ని చోట్ల ట్రాక్టర్ చార్జీలు కూడా పెంచారు. మరోవైపు డీజిల్ కొరత కారణంగా ప్యాసింజర్ ఆటోలు, ఇతర ట్రాన్స్‌‌పోర్ట్​ వెహికల్స్ కిరాయిలను పెంచుతున్నాయి.

సప్లయ్ చేస్తలేరు

మొన్నటిదాకా ముందే డబ్బులు కట్టుమన్నరు. ఇప్పుడు కడుతున్నా.. సప్లయ్ చేస్తలేరు. 20 వేల లీటర్లు కావాలని కంపెనీలను అడిగితే.. 10 వేల లీటర్లే వస్తున్నది. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నం.. స్టాక్‌‌ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నం. ఇంటర్నేషనల్‌‌గా రేట్లు పెరగడం, ఇక్కడ ధరలు పెంచుకునేందుకు కేంద్రం చాన్స్ ఇవ్వకపోవడంతో నష్టాలు వస్తున్నాయనే తక్కువ సప్లయ్ చేస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. రోజూ బంకుల దగ్గర క్యూ లైన్లు, నో డీజిల్ స్టాక్​ బోర్డులు తప్పడం లేదు. సప్లయ్ పెరిగితే కానీ కొరతను నివారించలేం.

- రాజీవ్ అమరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్ లీడర్‌‌

దుక్కి లేటయితంది

డీజిల్ లేక దున్నుడు ఈ సారి లేటయితంది. బంకులల్ల అడిగితే షార్టేజ్ అంటున్నరు. దుక్కులు దున్ని విత్తనాలు వేసే టైం ఇది. ఇప్పుడు డీజిల్ దొరక్క పోతే సాగు లేటయితది. స్టాక్ ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. అందుకనే ఎగిలివారంగ 4 గంటలకే బంకులకు పోతున్నం. డీజిల్ అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నం.

- మస్కు కుమార్, కునారం, పెద్దపల్లి జిల్లా

7 కిలోమీటర్లు పోయిన
దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంకుల్లో డీజిల్ కోసం పోతే స్టాక్ లేదని చెప్పిన్రు. ఎప్పుడు వస్తదని అడిగితే.. ఏమో అన్నరు. వాళ్లని, వీళ్లని అడిగితే ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చేగోమ్మ పెట్రోల్ బంకులో ఉందన్నారు. అక్కడకు వెళ్లి తెచ్చుకుంటున్నం. డీజిల్ కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నం.
- తేజావత్ భాస్కర్, కూసుమంచి, ఖమ్మం