ఎల్బీ నగర్​లో అధికార పార్టీ నేతల మధ్య విబేధాలు

ఎల్బీ నగర్​లో అధికార పార్టీ నేతల మధ్య విబేధాలు

ఎల్ బీ నగర్, వెలుగు: ఎల్​బీనగర్ సెగ్మెంట్​లో ఏండ్లుగా ఉన్న ఇండ్ల రిజిస్ట్రేషన్ సమస్యను తానే పరిష్కరించానని టీఆర్ఎస్ ఇన్ చార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ అన్నారు. రిజిస్ట్రేషన్ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సొంత డబ్బా కొట్టుకోవడం ఆపాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఎల్ బీనగర్​లో అధికార పార్టీ నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. 2008 నుంచి ఎల్​బీనగర్​లోని డివిజన్లలో ఇండ్ల రిజిస్ట్రేషన్ సమస్య ఉంది. ఈ సమస్యను పరిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ బుధవారం సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్న బహిరంగ సభలో  అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకే తాను కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్​లోకి మారుతున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారానికి సుధీర్ రెడ్డి చొరవే  కారణమంటూ స్థానికంగా ఆయన వర్గీయులు సోషల్  మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. మంగళవారం టీఆర్ఎస్ ఎల్ బీనగర్ ఇన్ చార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ వారి ఫొటోలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో  రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. ఇండ్ల రిజిస్టేషన్ సమస్యపై ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి సొంత డబ్బా మానుకోవాలన్నారు. రిజిస్టేషన్ సమస్యను తాను పరిష్కరించానని.. 2008 నుంచి దీనిపై పోరాటం చేస్తున్నానన్నారు. అప్పటి ఉమ్మడి ఏపీ సీఎంలు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి సైతం ఈ సమస్యను తీసుకెళ్లామన్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టేలా కృషి చేశానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వద్దకు ఈ సమస్యను తీసుకెళ్లానన్నారు. మాజీ కార్పొరేటర్లు ఇందుకోసం సహకరించారన్నారు. ఇందులో  సుధీర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు. సమస్యను పరిష్కరించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​కు రామ్మోహన్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు లక్ష్మీ ప్రసన్న, సామ రమణ రెడ్డి పాల్గొన్నారు.