సిద్దిపేట రూరల్, వెలుగు: దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా, ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో భార్యాభర్తలు చనిపోగా, వారి కొడుకు, కోడలు తీవ్రంగా గాయపడ్డారు. సిద్దిపేట త్రీ టౌన్ ఎస్సై ఎస్.మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణానికి చెందిన రవిచంద్రనాథ్(49), సునీత(45) సిద్దిపేటలో ఇంటీరియర్ వ్యాపారం చేస్తున్నారు.
ఇటీవల కొడుకు అజయ్ పెండ్లి హైదరాబాద్ కు చెందిన అర్చనతో జరగగా, నలుగురు కలసి గత నెల30న తమ సొంత కారులో భద్రాచలం దైవ దర్శనం కోసం వెళ్లారు. మంగళవారం తిరిగి వస్తుండగా, సిద్దిపేట అర్భన్ మండలం మిట్టపల్లి శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.
కారు నడుపుతున్న రవిచంద్రనాథ్, సునీత తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. అర్చన, అజయ్‌కు తీవ్రగాయాలవగా, వారిని చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్ కు తరలించారు. మృతుడి వియ్యంకుడు అంకం ప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి సమీపంలో హైదరాబాద్, శ్రీశైలం ప్రధాన రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.
ఎస్సై కురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. వంగూరు మండల కేంద్రానికి చెందిన బండపల్లి బాలరాజు(28), బండపల్లి ప్రవీణ్ కుమార్(27), బండపల్లి రాజు కలిసి కారులో కల్వకుర్తి మండలం తర్మికల్ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నారు.
ఈక్రమంలో తాండ్ర గేట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం కారును ఢీకొనడంతో బాలరాజ్, ప్రవీణ్ కుమార్ అక్కడికక్కడే చనిపోయారు. కారు నడుపుతున్న రాజుకు తీవ్రగాయాలయ్యాయి. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
