ఒకే పనికి ఒక్కో దవాఖానలో ఒక్కోలా జీతం?

ఒకే పనికి ఒక్కో దవాఖానలో ఒక్కోలా జీతం?

టిమ్స్‌‌లో రూ. 25 వేలు… నిర్మల్‌‌లో రూ.15 వేలు

సర్కార్ తీరుపై టీఎన్‌‌ఏఐకి నర్సుల కంప్లయింట్

వివక్ష వద్దంటూ నిర్మల్‌‌ కలెక్టర్‌‌‌‌కు టీఎన్‌‌ఏఐ లెటర్

హైదరాబాద్, వెలుగు: కరోనా వార్డులలో పనిచేసే నర్సుల వేతనాల విషయంలో సర్కార్ తీరుపై నర్సులు ఆగ్రహంతో ఉన్నారు . ఒకే పనికి ఒక్కో హాస్పిటల్ లో ఒక్కోలా జీతం ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిమ్స్, గాంధీ లాంటి హాస్పిటల్ లో పనిచేస్తున్న నర్సులకు ప్రారంభ వేతనం రూ. 25,140 ఇస్తున్నారు. రెండు రోజుల కింద నిర్మల్ జిల్లా హాస్పిటల్ లో నర్సుల భర్తీ కోసం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో మాత్రం ప్రారంభ వేతనం రూ.15 వేలు అని పేర్కొన్నారు. దీనిపై నర్సులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టీఎన్‌ ఏఐ) కు ఫిర్యాదు చేశారు . వెంటనే రియాక్టైన టీఎన్‌ ఏఐ ఒక్కో హాస్పిటల్ లో ఒక్కోలా జీతాలు ఇస్తూ వివక్ష చూపటం సరికాదంటూ జిల్లా కలెక్టర్ కు లెటర్ రాసింది. నర్సులకు కనీసం రూ. 20 వేల సాలరీ ఇవ్వాలంటూ గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. జీతం పెంచుతున్నట్లు ప్రకటిస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరింది. కరోనా వార్డుల్లో పనిచేసే నర్సులకు రూ.25 వేల సాలరీ ఇవ్వనున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు ఇలా చేయడమేంటని నర్సింగ్ ఆఫీసర్స్‌ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ ప్రశ్నించారు.