ఈ సండే స్పెషల్ .. హెల్దీ మిల్లెట్ బ్రేక్ ఫాస్ట్..తింటే టేస్ట్ మర్చిపోలేరు

ఈ సండే స్పెషల్ .. హెల్దీ మిల్లెట్ బ్రేక్ ఫాస్ట్..తింటే టేస్ట్ మర్చిపోలేరు

కొన్ని ఐటెమ్స్​ ‘ఇలా’ తయారుచేసుకుని తింటే టేస్ట్​ మర్చిపోలేరు. మళ్లీ మళ్లీ తినాలనుకుంటారు అనే మాట వినే ఉంటారు. ఈ మాట మిల్లెట్స్​కి సరిగ్గా సరిపోతుంది. ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలిగే హెల్దీ బ్రేక్​ ఫాస్ట్​ మిల్లెట్స్​తో అస్సలు మిస్సవ్వకండి. 


సామ దోశ

కావాల్సినవి : సామలు – ఒక కప్పు, మినప్పప్పు – పావు కప్పు, మెంతులు – ఒక టీస్పూన్, సగ్గుబియ్యం – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు, నూనె, నెయ్యి – సరిపడా, నీళ్లు – పావు కప్పు

తయారీ : సామలు, సగ్గుబియ్యం, మెంతులు, మినప్పప్పు శుభ్రంగా కడగాలి. తర్వాత నీళ్లు పోసి ఎనిమిది గంటలు నానబెట్టాలి. వాటిని మిక్సీజార్​లో వేసి, నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పిండిలో ఉప్పు వేసి కలపాలి. మూతపెట్టి మరో ఎనిమిది గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత పిండిని ఒకసారి బాగా కలిపి, దోశ పోయాలి. దానిపైన నెయ్యి కూడా వేసి కాల్చుకుంటే సరి. 

కొర్ర పొంగలి

కావాల్సినవి :
కొర్రలు – ఒక కప్పు
పెసరపప్పు – అర కప్పు
ఉప్పు, జీడిపప్పులు – సరిపడా
నీళ్లు – నాలుగు కప్పులు
నెయ్యి – మూడు టేబుల్ స్పూన్‌లు
జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్
మిరియాలు – ఒక టీస్పూన్ 
పచ్చిమిర్చి – మూడు
అల్లం – చిన్న ముక్క
కరివేపాకు – కొంచెం
ఇంగువ – చిటికెడు

తయారీ :

కొర్రలు శుభ్రంగా కడిగి, రాత్రంతా నానబెట్టాలి. పెసరపప్పును నూనె లేకుండా వేగించిన తర్వాత నీళ్లతో కడగాలి. ప్రెజర్​ కుక్కర్​​లో పెసరపప్పు, కొర్రలు, ఉప్పు వేసి నీళ్లు పోయాలి. మూతపెట్టి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పాన్​లో నెయ్యి వేడి చేసి జీలకర్ర, మిరియాలు, జీడిపప్పులు వేసి వేగించాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఇంగువ వేయాలి. ఈ తాలింపును పొంగలిలో వేసి కలపాలి. తర్వాత నెయ్యి వేసి కలపాలి. 

అరికెల ఉప్మా 

కావాల్సినవి :
అరికెలు – ఒక కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు – ఒక్కో టీస్పూన్, ఉప్పు – సరిపడా, ఉల్లిగడ్డ తరుగు – అర కప్పు, అల్లం తరుగు – పావు టీస్పూన్, నీళ్లు – ఒకటిన్నర కప్పు, క్యారెట్, 
బీన్స్ తరుగు – ఒక్కో కప్పు, పచ్చిమిర్చి – నాలుగు, కరివేపాకు – కొంచెం

తయారీ :
అరికెల్ని శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టాలి. ప్రెజర్ కుక్కర్​లో నెయ్యి వేడి చేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి వేగించాలి. అందులో ఉల్లిగడ్డ, అల్లం తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. తర్వాత క్యారెట్, బీన్స్ తరుగు వేసి కాసేపు వేగనివ్వాలి. ఆపై ఉప్పు వేసి కలపాలి. చివరిగా అరికెలు వేసి నీళ్లు పోసి కలపాలి. మూతపెట్టి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్  బాగుంటుంది.