
- గ్రామాల్లో పడిపోయిన డిమాండ్
- వెల్లడించిన నువామా స్టడీ రిపోర్ట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో గ్రామీణ డిమాండ్ బాగా తగ్గుతుందని, ఫలితంగా సబ్బులు, బిస్కెట్లు, పేస్టులు వంటి ఫాస్ట్ మూవబుల్కన్జూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) వస్తువుల అమ్మకాలు తక్కువగా ఉంటాయని కన్జూమర్ దేశీయ బ్రోకరేజ్ హౌస్ నువామా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. దీని రిపోర్టు ప్రకారం.. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ గిరాకీ తక్కువగానే ఉంటుంది. వార్షికంగా చూసినా అమ్మకాలు తగ్గుతాయి. గ్రామాల్లో అధిక నిరుద్యోగిత రేటు ఇందుకు కారణం. ఉపాధి హామీ పథకంలో భారీగా చేరికలు ఉన్నాయి. అయితే చాలా కంపెనీలకు వార్షికంగా గ్రాస్ మార్జిన్లు మాత్రం ఎక్కువగా ఉండొచ్చు. మార్జిన్లు పెరిగేకొద్దీ ప్రకటనలపైనా ఖర్చు పెరుగుతుంది. మూడో క్వార్టర్లో పండుగ డిమాండ్ చాలా మంది ఊహించిన దానికంటే తక్కువగా ఉంది. నాలుగో క్వార్టర్ అమ్మకాలు కూడా డల్లుగానే ఉండొచ్చు. 2025 ఆర్థిక సంవత్సరంలో క్రమంగా కోలుకోవాలని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు భావిస్తున్నాయి. "రాబోయే పార్లమెంటు ఎన్నికలు, ద్రవ్యోల్బణంలో మరింత తగ్గుదల వల్ల 2025 ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. అయినప్పటికీ, వాల్యూమ్ గ్రోత్ పరంగా చూస్తే మూడు, నాలుగో క్వార్టర్లో ఈ రంగానికి సవాళ్లు ఎదురవుతాయని మేం అనుకుంటున్నాం. డిసెంబర్ క్వార్టర్లో యునైటెడ్ బ్రూవరీస్, నెస్లే బాగా రాణిస్తాయని ఆశిస్తున్నాం”అని బ్రోకరేజ్ తెలిపింది.
ఇవీ కారణాలు...
పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ ఇంకా పెరుగుతూనే ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఇంకా తక్కువగా ఉండటం వలన ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు చెబుతున్నాయి. ఆదాయాలు తక్కువగా ఉండటం వల్ల గ్రామాల్లో అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా బలహీనమైన డిమాండ్ సెంటిమెంట్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న కంపెనీల దూకుడు పెరగడం, ఇతర ఖర్చులు పెరిగిపోవడంతో ఎఫ్‌ఎంసీజీ రంగం ఈ సంవత్సరం తక్కువగా వృద్ధి చెందింది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. ముడి పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో చాలా కంపెనీల స్థూల మార్జిన్‌లు వార్షికంగా పెరిగాయి. కరోనాకు ముందు, గ్రామీణ మార్కెట్లు మొత్తం వృద్ధి పరంగా పట్టణ మార్కెట్‌ల కంటే రెట్టింపు వేగంగా ఉన్నాయి. అయితే గత కొన్ని క్వార్టర్లుగా డిమాండ్ తగ్గింది. డిసెంబర్ క్వార్టర్లోనూ పరిస్థితి మారలేదు. గ్రామీణ మార్కెట్లు ఈ సంవత్సరం స్వల్ప వృద్ధిని మాత్రమే సాధించగా, పట్టణ ప్రాంతాల్లో వృద్ధి గత ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు క్రమంగా పెరిగిందని నువామా తన రిపోర్టులో పేర్కొంది.