డిగ్రీ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఇబ్బందులు

డిగ్రీ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్ లో  ఇబ్బందులు
  • నోటిఫికేషన్ నాటికే ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు 
  • రిజల్ట్ లేటుగా ఇవ్వడంతో అర్హులు కాదంటున్న గురుకుల బోర్డు

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో ఇటీవల గురుకులాల్లో డిగ్రీ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్ లో పేర్కొన్న అంశాలు పలువురు అభ్యర్థులకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఇటీవల నిర్వహించిన సెట్, నెట్ క్వాలిఫై అయినా.. ఈ పరీక్షల రిజల్ట్ రాకముందే నోటిఫికేషన్ ఇవ్వడంతో వారంతా అనర్హులుగా మారిపోయారు. దీంతో అభ్యర్థులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. స్టేట్​లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ డిగ్రీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న 868 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూషన్స్ సొసైటీ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్​ఈఐఆర్​బీ) ఈనెల 5న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్లికేషన్ల ప్రక్రియను17 నుంచి ప్రారంభమవుతుందని, మే 17 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ పోస్టులకు తప్పనిసరిగా తెలంగాణ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీఎస్ సెట్) లేదా యూజీసీ నిర్వహించే నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్ (నెట్) క్వాలిఫై అయినవారే అర్హులని తెలిపింది. అయితే తెలంగాణలో నిర్వహించే టీఎస్ సెట్ నోటిఫికేషన్ గతేడాది డిసెంబర్ 23న రిలీజ్ చేయగా, మార్చి 14, 15, 17 తేదీల్లో ఎగ్జామ్ నిర్వహించారు. మరోపక్క యూజీసీ సెట్ పరీక్ష ఫిబ్రవరి 21 నుంచి మార్చి 16 వరకూ జరిగింది. వీటి పరీక్షా ఫలితాలు నెలలోపే వస్తాయనే విషయం అందరికీ తెలుసు. అయినా రిక్రూట్​మెంట్ బోర్డు ఇవేవీ పట్టించుకోకుండా, ఈనెల 5న డీఎల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఈనెల13న నెట్ ఫలితాలు విడుదల కాగా, 24న సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో వీటిలో సుమారు 3500 మందికి పైగా క్వాలిఫై కాగా, వారంతా గురుకుల డీఎల్ పోస్టులకు అనర్హులుగా మారిపోయారు. అయితే, గతంలో టీఎస్పీఎస్సీ కూడా డీఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్ల నోటిఫికేషన్ రిలీజ్ చేయగా, టీఎస్ సెట్, నెట్ అభ్యర్థుల విజ్ఞప్తితో అప్లికేషన్ల ప్రక్రియ వాయిదా వేశారు. కానీ గురుకుల రిక్రూట్​మెంట్ బోర్డు మాత్రం అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నా, పట్టించుకోవడం లేదు. టీఎస్ సెట్ ఎగ్జామ్ రాష్ట్రంలో చివరికి సారిగా 2019లో నిర్వహించారు. మళ్లీ మూడేండ్ల తర్వాత పెట్టారు. అయితే, ఈ పరీక్షతో ఉపయోగం లేకుండా పోయిందని అభ్యర్థులు వాపోతున్నారు.

డీఎల్​ పోస్టులకు అవకాశం ఇవ్వాలె

ఈ నెలలో రిజల్ట్ వచ్చిన నెట్, సెట్ ద్వారా క్వాలిఫై అయిన వారికి గురుకుల డీఎల్ పోస్టుల దరఖాస్తులకు అవకాశం ఇవ్వాలి. మూడేండ్ల నుంచి తెలంగాణలో సెట్ ఎగ్జామ్ పెట్టలేదు. నెట్, సెట్ ఫలితాలు వస్తాయనీ తెలిసినా.. గురుకుల బోర్డు నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదు. ఈ విషయాన్ని అధికారులతో పాటుమంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి కూడా తీసుకుపోయాం. అభ్యర్థులకు న్యాయం చేస్తారనీ భావిస్తున్నాం.
- గ్యార నరేశ్, ఏఐఎస్ఎఫ్​స్టేట్ లీడర్