
- కిస్మత్ పురా – ఎక్సైజ్ అకాడమీ రూట్లో వాహనదారులకు ఇబ్బందులు
గండిపేట, వెలుగు: అధికారుల మధ్య కో ఆర్డినేషన్ లేక రోడ్డును తవ్వి వదిలేయడంతో బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధి కిస్మత్ పురా – ఎక్సైజ్ అకాడమీ రూట్లో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కిస్మత్‌పురా చౌరస్తా నుంచి ఎక్సైజ్ అకాడమీ వెనుక వైపు ఉన్న ఇందిరమ్మ ఇండ్ల వరకు అధికారులు కొత్తగా బీటీ రోడ్డు వేశారు.
ఈ పనులు పూర్తయిన తర్వాత డ్రైనేజీ మ్యాన్ హోల్స్ కిందకు ఉన్నాయంటూ వాటి పైకప్పును పైకి లేపేందుకు గుంతలను తవ్వారు. అయితే మట్టి కుప్పలను రోడ్డుపైనే పోశారు. మట్టిని తొలగించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. రోడ్డుపై మట్టిపోయడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని.. ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు.
అదే విధంగా రోడ్ల మధ్యలో స్ట్రీట్ లైట్ల స్తంభాలను ఏర్పాటు చేశారని.. వాటితో మరింత ఇబ్బందిగా మారిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.