
కావాలనే స్టే ఎత్తేసిండు
బడాబాబులకు అనుకూలంగా నిర్ణయాలు
లబోదిబోమంటున్న రైతులు
ఏసీబీకి పట్టుబడిన మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ అక్రమాలు తవ్విన కొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. ఆయన లంచాలు తీసుకుని బడా బాబులకు మేలు చేసేలా పలు నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నారు. ఇందుకు జిల్లాలో చోటు చేసుకున్న పలు ఘటనలు బలం చేకూరుస్తున్నాయి. తాజాగా నిజాంపేట మండలం బచ్చురాజుపల్లిలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నగేశ్ నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయంతో తాము తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆ గ్రామ రైతులు లబోదిబోమంటున్నారు.
మెదక్/నిజాంపేట, వెలుగు: జిల్లాలోని బచ్చురాజ్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 250, 263, 264, 265, 266లో సుమారు 40 ఎకరాల పట్టా భూమి ఉంది. 2011లో హైదరాబాద్ కు చెందిన కొందరు వ్యక్తులు వచ్చి ఫ్యాక్టరీ పెడతామని చెప్పి రైతులను నమ్మించారు. దాదాపు 26 మంది చెందిన 40 ఎకరాల భూమిని కొనేందుకు ఎకరాకు రూ.5.50 లక్షల చొప్పున బేరం కుదుర్చున్నారు. బయానాగా రూ.50 వేల చొప్పున చెల్లించారు. ఎక్కువ మొత్తం డబ్బులు చెల్లించేందుకు ఇన్‌కం ట్యాక్స్ ఇబ్బందులు ఉంటాయని, అందువల్ల మీడియేటర్‌గా ఉన్న వ్యక్తి ద్వారా ఒక్కొక్కరికి డబ్బులు పంపిస్తామని చెప్పి భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ తరువాత డబ్బుల గురించి అడిగితే అన్ని ఇచ్చేశాం, ఇంకెక్కడివి అని బెదిరించారు. దీంతో సంబంధిత రైతులందరూ ఏకమై ఎదురు తిరగడంతో భూమి కొనుగోలు చేసిన వక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి సంబంధిత రైతులు వారి భూములను ఎప్పటిలాగే సాగు చేసుకుంటున్నారు. కాగా ఈ భూముల విషయంపై రైతులు అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రామారెడ్డిని కలువగా స్టే ఇచ్చారు.
స్పందించిన కేటీఆర్..
భూప్రక్షాళన సమయంలో సదరు సర్వే నెంబర్లలోని భూములను రెవెన్యూ ఆఫీసర్లు పార్ట్ బీలో చేర్చడంతో రైతులకు కొత్త పాసు బుక్‌లు రాలేదు. దీంతో బాధిత రైతు కొడుకు ఒకరు ట్విట్టర్ ద్వారా సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై మంత్రి స్పందించి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో సంబంధిత రైతులకు పట్టా పాస్ బుక్‌లు జారీ అయ్యాయి. అప్పటి నుంచి పహణీ, 1–బిలు కూడా రైతుల పేర్ల మీదనే వస్తుండటంతో పాటు రైతుబంధు, రైతు బీమా కూడా అమలవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా అడిషనల్‌కలెక్టర్‌నగేశ్‌నిర్ణయంతో సీన్‌మొత్తం మారిపోయింది.
స్టే వెకేట్తో మ్యూటేషన్‌కు..
ఫిబ్రవరిలో బచ్చురాజ్‌పల్లి భూములపై ఉన్న స్టేను అడిషనల్ కలెక్టర్ నగేశ్ వెకేట్ చేయగా గతంలో ఆ భూములు కొనుగోలు చేసిన హైదరాబాద్ కు చెందిన వారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ఆధారంగా ఆ భూములను మ్యుటేషన్ చేసుకునేందుకు ఇటీవల నిజాంపేట తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలిసి సంబంధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై అడిషనల్ కలెక్టర్ నగేశ్‌ను కలిసి మాట్లాడితే ఆ భూమి మీరు ఎప్పుడో అమ్మేశారనీ, అందువల్ల ఆ భూమి మీది కాదని, కావాలంటే భూమి కొన్న వారితో మీకేమైనా డబ్బులు ఇప్పిస్తానని అన్నారని రైతులు వాపోయారు. కాగా ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ సంబంధిత రైతులు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన కాంప్లెట్స్ డ్రాప్ బాక్స్ ద్వారా మెదక్ ఇన్‌చార్జి కలెక్టర్ అయిన వెంకట్రామారెడ్డికి తమ సమస్యను నివేదించారు.
మా భూమి మాకు కావాలి
2011లో ఈడ ఫ్యాక్టరీ పెడుతం, యువకులకు నౌకర్లు ఇస్తమని నమ్మబలికి అగ్గువకే మా భూములను పట్నపోల్లు కొన్నరు. పైసలు ఇస్తామని నమ్మించి భూములను రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నరు. అటెంక పైసలు ఇయ్యలేరు. గప్పటి నుంచి మా భూముల్లో మేమే సాగు చేసుకుం టున్నం. అప్పటి జీసీ సాబ్ కు కూడా మావైపే స్టే ఇచ్చిండు. మొన్న ఫిబ్రవరిలో ఇప్పటి జేసీ సార్ ఆ స్టే ఎత్తేసిండట. భూమిని కొన్నోళ్ల పేరు మీదికి మారిస్తే మాకు అన్యాయం అయితది. -చిమ్మనమైన పోచయ్య, రైతు
స్టే వెకేట్ అయింది
బచ్చురాజ్ పల్లి విలేజ్ లోని 250, 263, 264, 265, 266 సర్వే నంబర్లలోని భూమిపై 2015 సంవత్సరం నుంచి రెవెన్యూ కోర్ట్ స్టే ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అడిషనల్ కలెక్టర్ నగేశ్ ఆ స్టే వెకెట్ చేశారు. ఈ క్రమంలో భూమి కొన్నవారు మ్యూటేషన్ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు . అయితే దాన్ని మేం ఇంకా అమలు చేయలేదు.-జయరామ్, నిజాంపేట తహసీల్దార్