ప్రభుత్వ విద్యార్థుల కోసం డిజిటల్ లైబ్రరీలు

ప్రభుత్వ విద్యార్థుల కోసం డిజిటల్ లైబ్రరీలు
  • విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుకోవాలనే సదుద్దేశంతో వారికి పాఠ్య పుస్తకాలతోపాటు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ఇందులో భఆగంగా రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో లో కోటి రూపాయల ఖర్చుతో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో కోటి రూపాయలతో అత్యాధునికంగా నిర్మించే డిజిటల్ లైబ్రరీకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డిలతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర లైబ్రరీ సంఘాల అధ్యక్షుడు శ్రీధర్ సూచన మేరకు సీఎం కేసీఆర్ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు సిద్ధమయ్యామని తెలిపారు. 
ఒక్కో విద్యార్థికి లక్షా ఇరవై వేలు ఖర్చు చేస్తున్నాం
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పేద విద్యార్థులకు విద్యను అందించడానికి కోట్లాది రూపాయల ధనాన్ని వెచ్చిస్తూ విద్యా ప్రాప్తికి ఎనలేని కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాలు కట్టించి ప్రతి విద్యార్థి పై లక్షా ఇరవై వేల రూపాయల చొప్పున ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఆమె కొనియాడారు. విద్య  కోసం సీఎం కేసీఆర్ ఆర్ ఒక విజన్ నిర్దేశింకుని దాన్ని కార్యరూపంలోకి తెచ్చేందుకు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారని మంత్రి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని బీద బలహీన బడుగు వర్గాల ప్రజలు వారి కుటుంబాలకు చెందిన ఆడపిల్లలను ఆర్థిక భారం భరించలేక ప్రాథమిక స్థాయిలోనే విద్యనభ్యసించడం నిలిపివేస్తున్నారన్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్లలందరూ ఉన్నత విద్యా కోర్సులు చదువుకోవాలనే తలంపుతోనే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 33 కళాశాలలు మహిళల కోసమే  ప్రత్యేకంగా  ఏర్పాటు చేసిందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్సీ వాణి దేవి, మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ తోపాటు వివిధ వార్డులకు చెందిన కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు