పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై దిల్ రాజు స్పందన.. పత్రికా ప్రకటనలో పేర్కొన్న అంశాలు ఇవే..!

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై దిల్ రాజు స్పందన.. పత్రికా ప్రకటనలో పేర్కొన్న అంశాలు ఇవే..!

థియేటర్ల బంద్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బంద్ వ్యవహారంలో ఎవరున్నా.. చివరికి జనసేన నేతలైనా సరే వదిలిపెట్టొద్దని ఆయన అన్నారు. కొత్త సినిమాల టికెట్ల పెంపుపై నిర్మాతలు కాకుండా.. ఫిలిం ఛాంబర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవాలని.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా పవన్ మాట్లాడిన విషయం తెలిసిందే. 

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. డిప్యూటీ సీఎం పవణ్ వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశంపై మంగళవారం (మే 27) పత్రికా ప్రకటన విడుదల చేశారు దిల్ రాజు. సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశం పై పవన్ కళ్యాణ్ ఆలోచనలకు పూర్తిగా ఏకీభవిస్తున్నానని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నిర్మాతలు వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలనే సూచన పరిశ్రమకు శాశ్వత దిశ ఇస్తుందని.. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలసి ముందుకు సాగాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దిల్ రాజు పత్రికా ప్రకటనలో పేర్కొన్న అంశాలు ఆయన మాటల్లోనే:

  • ‘‘సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న వారి అభిప్రాయం అభినందనీయం. 
  • దీనిని మనమందరం స్వాగతించి, కలిసికట్టుగా ముందుకు సాగుదాం.
  • థియేటర్ల నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు సినిమాలు త్వరగా వెళ్తుండటంతో ప్రేక్షకులు ఓటీటీ వైపుకు మొగ్గు చూపుతున్నారు. 
  • ఒక సినిమా ఎంతకాలానికి ఓటీటీకి వెళ్లాలి అనే అంశంపై మనమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. 
  • ప్రేక్షకుడికి వెండితెరపై సినిమా చూసే అనుభూతిని అర్థవంతంగా తెలియజేయడం మనందరి బాధ్యత.
  • ఈ దిశగా ముఖ్యమైన తొలి అడుగులు వేసిన గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
  • థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి మరో ముఖ్యమైన కారణం పైరసీ. 
  • మనమంతా కలిసికట్టుగా పైరసీపై పోరాడినప్పుడే, మన ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించగలగుతాము.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతాము 
  • మన తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి కలిసికట్టుగా తోడ్పడుతాం.’’

►ALSO READ | హౌస్ ఫుల్-5 ట్రైలర్.. అల్లరి.. మిస్టరీ.. కంప్లీట్ కామెడీ ప్యాక్.. నవ్వకుండా ఉండలేరు..!