
హాంకాంగ్: టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.. హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో టీమిండియాకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని నిర్వాహకులు మంగళవారం ధ్రువీకరించారు. ఈ టోర్నీ నవంబర్ 7 నుంచి జరుగుతుంది.
‘హాంకాంగ్ సిక్సెస్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ టోర్నీకి మంచి చరిత్రతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కూడా ఉంది. అద్భుతమైన రికార్డులు కలిగిన ఆటగాళ్ల బృందానికి నాయకత్వం వహించడానికి ఎదురుచూస్తున్నా. ఫ్యాన్స్‌కు ఆనందం, వినోదం కలిగించేలా భయం లేని క్రికెట్ ఆడాలని మనమందరం లక్ష్యంగా పెట్టుకుందాం’ అని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు.
ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియెన్స్, నాణ్యమైన నాయకత్వ లక్షణాలు, విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా ఉన్న దినేశ్ కార్తీక్ రావడం అభిమానులకు స్ఫూర్తినిస్తుందని టోర్నీ నిర్వాహకులు వెల్లడించారు. టీమిండియా కెప్టెన్‌గా దినేశ్ రాకను స్వాగతిస్తున్నామని క్రికెట్ హాంకాంగ్ చైనా చైర్ పర్సన్ బుర్జీ ష్రాఫ్ వ్యాఖ్యానించారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా హాంకాంగ్ సిక్సెస్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే చాన్స్ ఉంది.