కాంగ్రెస్ గెలుపులో ప్రజా సంఘాలది కీలక పాత్ర : దీపాదాస్​ మున్షీ

కాంగ్రెస్ గెలుపులో ప్రజా సంఘాలది కీలక పాత్ర : దీపాదాస్​ మున్షీ
  • సంఘాల నేతలు నన్ను ఎప్పుడైనా కలవొచ్చు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు జనాలు చరమగీతం పాడి.. ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజా సంఘాలు కీలక పాత్ర పోషించాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు. ప్రజా పాలనను తెచ్చినందుక ఆమె ప్రతి సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పై సంఘాల నాయకులు తనను ఎప్పుడైనా కలవొచ్చన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో సమన్వయం చేయడానికి తాను రెడీగా ఉంటానని మున్షీ తెలిపారు. 

శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని గాంధీ సెంటీనరి హాల్లో సామాజిక సంస్థలు, ప్రజా సంఘాలు, నిరుద్యోగ ప్రతినిధులు, విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో  "ప్రజలు ఈ ప్రభుత్వం నుంచి  ఏం ఆశిస్తున్నారు"  అనే అంశంపై  కాంగ్రెస్ వార్ రూమ్ చైర్మన్ మల్లాది పవన్, రియాజ్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు దీపాదాస్ హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లినప్పుడు మాత్రమే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉందని ఆమె అన్నారు. నియంతృత్వం ప్రజలకు న్యాయం చేయదని, ఇందుకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శమన్నారు.

 ఎన్నికల మేనిఫెస్టో తమకు రాజ్యాంగం లాంటిదని, తాము ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని మున్షీ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎడ్యుకేషన్, హెల్త్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అనంతరం నిరుద్యోగులు, వివిధ సామాజిక సంస్థలు ఇచ్చిన వినతిపత్రాలను స్వీకరించి, వాటిని సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రజా పాలన ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని ప్రజా సంఘాల నేతలు కోరారు.