
- నేరుగా భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం
- వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్వో, వీఆర్ఏల్లో అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయం
- 10,954 జీపీవో పోస్టులకు అర్హులైనోళ్లు ఏడు వేల లోపే
- వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్లీ ఖాళీలు.. సర్వీసుపరమైన ఇబ్బందులు
హైదరాబాద్, వెలుగు: గ్రామ పాలన అధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం కోసం చేపట్టిన విధానంలోనే జీపీవోల నియామకాన్నీ చేపట్టాలని యోచిస్తున్నది. అలాగైతే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. భూ భారతి చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా జీపీవోల నియామకం పూర్తి చేయాలని సర్కార్ భావిస్తున్నది.
భూభారతి చట్టం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొత్తగా గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులను మంజూరు చేసింది. మొత్తం10,954 జీపీవో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. జీపీవో జాబ్‌చార్ట్ కూడా ప్రకటించింది. గత సర్కారు హయాంలో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఏ, వీఆర్వోలలో అర్హులైనవారిని జీపీవోలుగా తీసుకొని, మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదట నిర్ణయించింది.
ఈ మేరకు జీపీవోలుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ఉన్నవారి నుంచి కలెక్టర్ల ద్వారా ఆప్షన్స్ తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7 వేల మందికి అర్హతలు ఉన్నట్లు తెలిసింది. వీరికి ఎంట్రన్స్ టెస్ట్నిర్వహించి, జీపీఓలుగా అపాయింట్ చేయాలని ప్రభుత్వం భావించింది. కాగా, ఇవి కొత్త పోస్టులు కావడంతో ఇందులో చేరే వీఆర్వో, వీఆర్ఏలు తమ పాత సర్వీస్‌ను కోల్పోతారు. దీంతో ఈ అంశంపై పలువురు కోర్టుకు వెళ్లారు. జీపీవోలుగా చేరినప్పటికీ తమ పూర్తి సర్వీసును పరిగణనలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును ఆశ్రయించారు.
దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. సర్వీస్ ఇష్యూస్‌తో పాటు ఆయా శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఏ, వీఆర్వోలను తీసుకుంటే.. ఆయా శాఖల్లో మళ్లీ ఖాళీలు ఏర్పాడుతాయని, ఇది కొత్త సమస్యకు దారి తీస్తుందని భావిస్తున్నది. దీంతో ప్రభుత్వం ఈ 10,954 పోస్టులను పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
సర్దుబాటైన వీఆర్వోలను, వీఆర్ఏలను తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..? దానికి బదులు జూనియర్ పంచాయతీ సెక్రటరీల మాదిరే జీపీవోలను రిక్రూట్చేసుకుంటే ఎలా ఉంటుంది..? ఇందులో ఏ విధానం మంచిదో ఒక నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారులను సర్కారు అడిగినట్లు తెలుస్తున్నది. ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చాకే జీపీవోల నియామకంపై సర్కారు తుదినిర్ణయం తీసుకునే అవకాశం
కనిపిస్తున్నది.