
మళ్ళీరావా, జెర్సీ లాంటి ఎమోషనల్ సినిమాల తర్వాత గౌతమ్ తిన్ననూరి రూపొందించిన చిత్రం ‘కింగ్డమ్’. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇటీవల విడుదలైంది. సినిమాకొస్తున్న రెస్పాన్స్ గురించి గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ ‘ఏ కథయినా, ఏ సన్నివేశమైనా అందులో ఉన్న ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయగలగాలి. ఈ సినిమా విషయంలో కూడా అదే సూత్రం ఫాలో అయ్యాను. ఇందులో యాక్షన్ ఉన్నప్పటికీ, దాని చుట్టూ బలమైన ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ కనెక్ట్ అయింది కాబట్టే, యాక్షన్ వర్కౌట్ అయింది.
ఈ సినిమాకి ముందుగా దేవర నాయక, యుద్ధకాండ లాంటి టైటిల్స్ అనుకున్నాం. ఫైనల్‌గా ‘కింగ్డమ్’ అయితే అన్ని భాషల ప్రేక్షకులకు రీచ్ అవుతుందని పెట్టాం. విజయ్ నెక్స్ట్ లెవల్ యాక్టింగ్ చేశారు. సత్యదేవ్‌తోపాటు కొత్త నటుడు వెంకటేష్ పాత్రలకు కూడా మంచి అప్లాజ్ వస్తోంది. ఇందులో తొలగించిన హృదయం లోపల పాటతో పాటు కొన్ని సీన్స్‌ను యాడ్ చేసి ఓటీటీ వెర్షన్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఇక ఈ మూవీ సెకండ్ పార్ట్‌కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ త్వరలో ప్రారంభిస్తా. అయితే పార్ట్-2 కంటే ముందుగా.. మురుగన్, సేతు పాత్రల నేపథ్యంలో ఓటీటీ కోసం ఓ వెబ్ ఫిల్మ్ చేయాలని భావిస్తున్నాం’ అని చెప్పాడు.