తెలంగాణ భాషకు డాక్టర్‌ ఈ పాషా

తెలంగాణ భాషకు డాక్టర్‌ ఈ పాషా

‘పట్టు పట్టగరాదు. పట్టి విడువరాదు’ అని వేమన చెప్పినట్లే తల్లి భాషను మరువరాదు. మరచిపొమ్మంటే పోరాటం విడువరాదు’ అంటుండు . ‘D/O వర్మ’ సినిమా డైరెక్టర్​ ఖాజా పాషా. తెలంగాణ భాష కోసం తండ్లాడిన ఖాజా పీహెచ్​డీ థీసిస్ ని అదే భాషలో రాసి ఇంకో తండ్లాట నడిపిండు. తెలంగాణ భాష కోసం ‘చింతబరిగె స్కీం’ వేసి, కొట్లాడి మరీ డాక్టరేట్ పట్టా సాధించిండు డాక్టర్​ ఖాజా పాషా.

బచ్‌ పన్​ నుంచే సినిమాలంటే ఎంతిష్టమో. పుస్తకాలంటే అంతిష్టం . మా నాయిన ఆర్​ఎంపీ డాక్టర్​. ఎక్కడెక్కడో అడవిలో ఉండే ఊళ్లలో వైద్యం చేసిండు . అమ్మ కూడా నాయనతోనే ఉండేది. మా ఊరు గున్నే పల్లి (మహబూబాబాద్‌ జిల్లా) నుంచి సూర్యా పేటకు పోయి చిన్న గదిల ఉంట సదువుకున్న. మా సుట్టాలు అక్కడ ఉండేటోళ్లు. మా బాబాయి మంచి సదువరి. నవలలు అద్దెకు తెచ్చెటోడు . గవన్నీ సదివిన. ఓపాలి మా నాయనమ్మ దగ్గరకు సూరత్‌ పోయిన. అక్కడ యండమూరి నవలలు బాగా సదివిన.

గిదేమి అన్యాయం?
సూర్యా పేటకు దగ్గరని బీసీఏ చదవనీకి ఖమ్మం పోయిన. నా భాష భలేగుందని అక్కడోళ్లు అనేది. మా బ్యాచ్​ల ఆంధ్రోళ్లు కూడా ఉన్నరు. నువ్వు మాట్లాడితే భలే గమ్మత్తుగ ఉంటదనేటోళ్లు. తెలంగాణ భాషని తేలిగ్గా తీసిపారేసేటోళ్లు. షాపింగ్​కి పోతే.. వాళ్లను ‘మీది ఆంధ్రానా?’ అని అడిగేటోళ్లు. వాళ్లేమో.. ‘ఇదేంట్రా మనల్ని ఆంధ్రా అని అడుగుతున్నారు. ఇదేమన్నా అమెరికానా?’ అని నవ్వుకు నేటోళ్లు. నేను వాళ్లతో వాదులాడేది. తెలంగాణ ఉద్యమం వచ్చినంక మనకు జరిగి న అన్యాయం తెలిసింది.

ఒక్క ఛాన్స్​ కోసం
‘సినిమాల్లోకి పోవాలని ఆశ. ఆడ ‘ఇజమ్స్’ ఉంటయట. మనోళ్లు డైరెక్టర్లయితరా? అని డౌటుండె. మా ఫ్రెండ్స్​ మాత్రం నీకు సినిమా సూటయితదనేటోళ్లు. అప్పటికే 70 పేజీల నవల రాసి, మధ్యలో ఆపిన. అప్పట్ల నవలని ఎట్ల  మొదలుపెట్టాల్నో , ఎట్ల ముగించాల్నో కూడా తెల్వది. తెలంగాణోళ్లు డైరెక్టర్లు కారనే అనుకుంటు న్న.. అప్పుడే ‘ఎన్​కౌం టర్’ సిన్మా చూసినంక మనోళ్లు కూడా డైరెక్టర్లు అయితరని తెలిసింది. శంకర్​ వాళ్ల ఊరు సూర్యా పేట దగ్గరే. దశరథ్ , శంకర్​, సురేం దర్​ రెడ్డి గురించి తెలిసింది. దశరథ్ ఓ ఇంటర్యూ ల యండమూరి దగ్గర పనిచేసిన్నని చెప్పిండు .   సినిమాల కోసమని సిటీకి వచ్చిన. యండమూరి దగ్గరికి పోయిన. ‘ఇప్పుడు సినిమా ట్రైనింగ్​ ఇయ్యట్లే .. కృష్ణా నగర్​లో ఉంటయి. ఫీజు కట్టి చేర’ని ఆయన చెప్పిండు . తర్వాత వేరేటోళ్లని కలిసిన. ‘నువ్వే మయినా రాసినయి ఉన్నయా?’ అన్నరు. చూసి బాగున్నయన్నరు. తర్వాత పిలుస్తమన్నరు. అంతే.. ఎవలూ పిలువలే. కృష్ణ వంశీని కలిసిన. ఇప్పుడు సినిమా చేయట్లేదన్నడు. ‘వెయిట్​ చేస్త సార్​’ అంటే ‘వెయింటింగ్​లో వందల మంది ఉన్నర’ని చెప్పిండు . కాంపిటీషన్​ ఎట్లుం దో అప్పుడు తెలిసింది. అట్ల ఏడాది అయిపోయింది.

సినిమా థియేటర్లు కట్టే కోర్స్​..!
ఫైన్​ ఆర్ట్స్ చదవనీకని మా ప్రెండ్స్​ వచ్చినరు. వాళ్లు కలిస్తే ‘సిన్మాల్లో ట్రై చేస్తున్న’ని చెప్పిన. ‘ఖాళీ గా ఉండకుండ  థియేటర్​ కోర్స్​ చదవొచ్చు’గా అన్నరు వాళ్లు. థియేటరా? అది మనకెందుకు అన్న. థియేటర్​ ఆర్ట్స్ అంటే?.. సినిమా థియేటర్‌ ఎట్ల కట్టాలె? సీట్లెన్ని ఉండాలె? తెర ఎంత వెడల్పు కట్టాలె? నేర్పిస్త రు కదా’ అన్న. వాళ్లు మస్త్​గా నవ్వి ..‘థియేటర్‌ ఆర్ట్స్‌‌‌‌ అంటే నువ్వనుకునేది కాదు. నాటకం గురించి నేర్పేది’ అన్నరు. సినిమా ఇండస్ర్టీల పాగా వేయొచ్చు. హాస్టల్​ ఫ్రీగా వస్తదని థియేటర్​ ఆర్ట్స్ పీజీ అడ్మిషన్​ కోసం తెలుగు యూనివర్సిటీల ఇంటర్వ్ యూకి పోయిన. సెలెక్ట్​ అయిన.

శాపగ్రస్తులు
థియేటర్​ ఆర్ట్స్ స్టూడెంట్స్​ అందరూ ప్రొడక్షన్​లో స్ర్కిప్ట్​ రాయాలె. అందరివీ ఓకే అయినయ్ . కానీ, నాది ఓకే కాలె. నేను తోపుని. ఎడమచేత్తో రాసినా ఓకే అయిద్దనే ఫీలింగ్​తో ఉన్న. ప్రొఫెసర్​ శేఖర్​ పిలిచి.. నా స్ర్కిప్ట్​లో  లోపాలున్నయన్నడు. ‘ఇది ఒక సంఘటన. నాటకీయత లేదు. సంఘటన, సంఘర్షణ ఉండాలె. సంఘర్షణ నాటకీయతకు దారితీయాలె’ అని సార్​ చెప్పిండు . ఫ్రెండ్స్​కి లవ్ లెటర్స్​ రాయాలంటే నాతోనే రాయిం చినరు. పోయెటిక్​ గా రాసిన. కానీ ఫస్ట్​ టైమ్​ నా రాత సరి గా లేదన్నరు. ఇంకో స్క్రిప్ట్​ రాస్తానని చెప్పి తప్పిం చుకు తిరుగుతాన్న. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్​కు దగ్గర్లో ఒక షాపు ఓపెనింగ్​ అయితంది. హిజ్రాలొచ్చి డబ్బులి య్యమటున్నరు. షాప్ వాళ్లు ఇయ్యట్లే . పెద్ద గొడవయ్యింది. హిజ్రాలను కొట్టిన్రు. అది దగ్గర నుంచి చూసిన. ఆ తర్వాత మా ఫ్రెండ్ కి కిడ్నీలు ఫెయిలైతే హాస్పిటల్​కి పోయిన. డయాలసిస్​కి 2,500 రూపాయలు తీసుకున్నరు. అప్పట్ల 1,500 రూపాయలు ఉంటే బ్యా చిలర్​కి నెల గడిచేది. నాలాంటో నికి ఈ బాదొస్తే ఎట్లని అనుకున్న. అప్పుడే ఈ రెండు సంఘటనల ఆధారంగా ఒక నాటకం రాయాలనుకున్న. హిజ్రాలు తమలో ఒకడికి డయాలసిస్​ కోసం ఇట్లా యాచన చేస్తున్నట్లుగా, ఇబ్బందులు పడుతు న్నట్లుగా ‘శాపగ్రస్తులు’ పేరుతో నాటకం రాసిన. స్టూడెంట్​ ప్రొడక్షన్​లో 2006లో దీనిని ప్రదర్శిం చినం. ఫరెవర్​ ఫెం టాస్టిక్​ థియేటర్​, సూర్యా పేట’ పేరుతో నంది నాటకోత్సవాలకు అప్లై చేసినం. చాలా మంది ఏ విభాగంలో అవార్డు రాదన్నరు. ఎంట్రీ అయితే చాలనుకున్న. కానీ, అదే అయిదు నందులు గెలుచుకుంది!

తీన్మార్​ ము చ్చట
తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తంది. అదే టైమ్​ల వీ6 టీవీ వచ్చింది. అందులో యాంకర్లు తెలంగాణ యాసకు ఇంగ్లీష్ ని కలిపి మంచిగ ముచ్చట్లు చెప్పోటోళ్లు. వార్తలు చదివేటోళ్లు. తెలంగాణ యాసకు ఇంగ్లీష్ తో ఫ్యూజన్​ చేస్తే ఎంత  అందంగ ఉంటదో అప్పుడు తెలిసొచ్చింది. నాకు బాగ నచ్చింది. వీ6కి ముందు మన భాషని మోటు భాషగా చూసినోళ్ల మనసు మారింది. తెలంగాణ యాస మాట్లాడితే ఏమనుకుంటరో అనుకునే మనోళ్లు కూడా మారిన్రు. తెలంగాణ ఉద్యమ వాతావరణంలో పరిశోధన చేసిన. తెలంగాణ వచ్చింది. థీసిస్‌ రాయడం మొదలుపెట్టిన. పీహెచ్​డీ థీసిస్​ రాయడానికి చికాగో స్టైల్​ షీట్, ఇంకొన్ని స్టైల్​ షీట్స్​ ఉంటయి. చాలా యూనివర్సిటీల్లో వాటిని ఫాలో అయితరు. కానీ, తెలుగు యూనివర్సిటీకి ఒక స్టైల్​ షీట్​ అంటూ ఏదీ లేకుండె. నేను తెలంగాణ భాషలోనే థిసీస్​ రాసిన. 2015లో ప్రి సబ్మిషన్​ చేసిన. అందులో ‘వచ్చిన్రు. పోయిన్రు. అండ్ల, ఇండ్ల, అట్ల, ఇట్ల, ఆల్లు, ఈల్లు, చెప్పిన్రు. ఇచ్చిన్రు. వచ్చిర్రు, పోయిర్రు, చేసిర్రు’  అనే పదాలు చూసి మా గైడ్ ఆశ్చర్యపోయిండు . ఇదేం ది ఇట్ల రాసినవ్ ఇది. కరెక్ట్​ కాదు. మార్చి రాయమన్నడు. బోర్డు మీద ఆంధ్రప్రదేశ్ ప్లేసు లో తెలంగాణ రాసినా మార్పు రాలే. ‘నేను రాసింది కరెక్టే మార్చన’న్న. ఇట్ల ఒప్పుకోరని గైడ్ చెప్పిండు .

అట్లనే కొట్లాడి..
నేను మల్లా మార్చి రాయనన్న. నా భాషను నేనెందుకు మార్చు కోవాలె? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇట్లుంటే ఎట్లని పోరాడిన. అప్పడు రిజిస్ర్టార్​ థోమసయ్యని కలిసిన. ఆయన చూసి వీసిని కలువన్నడు. వీసీ ఎల్లూరి శివారెడ్డిని కలిసిన. ఆయన థీసిస్​ చూసి ఇట్ల రాస్తే తప్పేంలేదన్నడు. ఆ తర్వాత వీసీ మారిండు. కొత్త వీసీ వచ్చినంక రూల్స్‌‌‌‌​ మారినయన్నరు. మారిన రూల్స్​ ప్రకారం రాయమన్నయి రాసిచ్చిన. కానీ, భాష మార్చుకోలే. ఇంకో ఏడాది పట్టింది. తర్వాత పీహెచ్​డీ అవార్డు కాలే. ఎంతకీ కాకుంటే పెద్దోళ్లని కలిసిన. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి , భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్​ మామిడి హరికృష్ణ దగ్గరికి పోయిన. వాళ్లంతా మంచి పని చేసినవన్నరు. ఇదే మనకు కావాల్సిందని చెప్పిన్రు. మూడేళ్ల తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం మనసు మార్చుకున్నది. నాకు డాక్టరేట్​ డిగ్రీ ఇచ్చింది.

గోల్డెన్​ డేస్

థియేటర్​ ఆర్ట్స్ చదువుతున్నప్పుడు సినిమా మీదే ఇంట్రెస్ట్​. కాకపోతే నాటకాలేస్తే ఉపయోగపడతదనుకుంటున్న. నాటకాలు వేసే అవకాశం ఎక్కడొచ్చినా పోయిన. డబ్బులి య్యకున్నా ఇడ్లీ పెడితే చాలనుకున్న. పీజీ చదువుతున్నప్పుడే ‘నేరాలు ఘోరాలు’ కార్యక్రమంలో నటిం చే అవకాశం వచ్చింది. నా టాలెంట్​ చూసి అసిస్టెంట్​ డైరెక్టర్ ఛాన్స్​ ఇచ్చినరు.

నంది నాటకోత్సవాల్లో డైరెక్టర్​ శంకర్​ పరిచయమైండు . ఆ పరిచయంతో తన సినిమాకి స్ర్కిప్ట్​ వర్క్​ చేసిన. ఓ తమిళ దర్శకు డికి ‘సారాయి వీర్రాజు’ సినిమా అవకాశం వస్తే అసోసియేట్​గా రమ్మన్నడు. అట్ల సినిమాల్లోకి అడుగు లేసిన. పీజీ అయిపోయినంక ఎంఫిల్​ల సీటొచ్చింది. ‘యండమూరి నాటికలు – రంగస్థల ప్రయోగం – ఒక పరిశీలన’ పేరుతో రీసెర్చ్‌‌ చేసిన. సినిమా పూర్తయిన తర్వా త థీసిస్​ రాసిన. బెస్ట్​ థీసిస్​గా సెలెక్ట్​ చేసి బొప్పన్న అవార్డ్​ (గోల్డ్​ మెడల్​) ఇచ్చినరు. ఆ తర్వా త పీహెచ్​డీ లో చేరిన. తర్వా త D/o వర్మ మూవీకి డైరెక్టర్​ ఛాన్స్​ వచ్చింది.

‘చింతబరిగె స్కీం’ని చితక్కొట్టినరు

పిలగాండ్లు ఇంట్ల మంచిగనే మాట్లాడుతరు. బయటికి పోయి పెద్దవాళ్లను కలిస్తే యమ్మటే ఆళ్ల భాష మారుతది. మూడో తరగతి చదివే పిలగాడే ఇట్ల భాష మార్చుకుంటంటే ఇగ యూనివర్సిటీల్ల సదివే పిలగాం డ్లు ఎట్లుంటరు? ఈ అంశాన్నే తీస్కోని నాటకం రాసిండు.

‘చింతబరిగె స్కీం’ పేరుతో ప్రదర్శించిండు .

ఆ నాటకంలో ఏముందంటే?..

‘వచ్చిండన్నా , వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా’ అంటరు. వచ్చిండని, వచ్చాడని మనమే అంటం. వాళ్లెప్పుడు వచ్చిండని అనరు. వాళ్ల సౌలత్​ కోసం మనమే మారుతం. కానీ, ఆల్లు మారరు. మనం ఎందుకు మారాలె? ఎవని భాష ఆనికి గొప్ప. ఇట్ల అమ్మ భాషని మార్చుకొనుడు ఏందని ఈ నాటకంల ఉంటది. ఎవనికి ఎన్ని భాషలు అచ్చినా దెబ్బ తగిలితే అమ్మ భాషలనే ఏడుస్తడు. అట్లనే అమ్మ భాషను మరిచిపోయినోళ్లకు నొప్పి లేస్తే అమ్మ భాష అదే అస్తది. అందుకే ఒకటో ఎక్కం రాని పోరడిని పంతులు చింత బరిగెతో కొడితే ఎట్ల దారికొస్తడో పెద్దోళ్లని కూడా ఈ చింత బరిగె స్కీంతో దారికి తేవాలట. ఈ నాటకానికి వచ్చిన ఆదరణ చూసి దీనిని 15 సార్లు ప్రదర్శించేందుకు ప్రోత్సహించిన్రు. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం సందర్భంగా ఓసారి సోమాజిగూడలోని ప్రెస్​క్లబ్ లో ఈ నాటకం ప్రదర్శిస్తున్నరు. అప్పుడు కొంతమంది తాగుబోతులు ‘చింతబరిగె స్కీం’ టీమ్​ని కొట్టిన్రు.