టాలీవుడ్‌లో ఒక ట్రెండ్ సెట్టర్

టాలీవుడ్‌లో ఒక ట్రెండ్ సెట్టర్

ఓ సినిమా తీయాలంటే ఒక ఆలోచన చాలు. కానీ ఒక మంచి సినిమా తీయాలంటే మాత్రం దర్శకుడి మదిలో పెద్ద మథనమే జరగాలి. మరి అన్ని మంచి సినిమాలు తీశారంటే కృష్ణవంశీ మనసులో ఎంత మథనం జరిగివుంటుందో! దేవతలూ రాక్షసులూ కలిసి సముద్రాన్ని చిలికితే అమృతం పుట్టినట్టు.. కృష్ణవంశీలోని రచయిత, దర్శకుడు కలిసి కృషిచేస్తే అద్భుతమైన చిత్రాలు పుట్టుకొచ్చాయి. కొంతకాలంగా కేవీ ఫామ్‌లో లేడు. అంతమాత్రానికే ఆయన మరుగున పడిపోడు. ఎందుకంటే.. ఆయన కృష్ణవంశీ. క్రియేటివ్ డైరెక్టర్. టాలీవుడ్‌లో ఒక ట్రెండ్ సెట్టర్.

కృష్ణవంశీ.. పేరు కాదు బ్రాండ్!

తెలుగు యువత చేతుల్లో ప్రేమ ‘గులాబి’ని పెట్టి, ‘నిన్నే పెళ్లాడతా’ అంటూ ఉరకలు వేయించారు కృష్ణవంశీ. తెలుగు సినిమాకి ‘సింధూరం’ రంగును అద్ది.. ‘సముద్రం’ అంత అభిమానాన్ని సంపాదించుకున్నారు. అంత:పురం, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ అంటూ ఎన్ని మంచి సినిమాలు తీశారని! ఒక్కొక్కటీ ఒక్కో జానర్. దేనికదే సూపర్. ప్రతి చిత్రంలోనూ కేవీ మార్క్‌ అచ్చు గుద్దినట్టు కనిపిస్తుంది. తెర నిండా రంగులు.. ఫ్రేమ్‌ నిండుగా క్యారెక్టర్లు.. అరుపు కేకలు.. అల్లర్లూ ఆనందాలూ.. ఊసులూ ఉద్వేగాలూ.. ఎంత చక్కని టేకింగ్‌ అది! ఇది కృష్ణవంశీ సినిమా అంటూ వాటిపై ఓ బ్రాండ్‌ పడిపోయింది. వాటిలోని ప్రతి సీన్, డైలాగ్, సాంగ్‌ ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయింది. తెరపై పాత్రలు కదులుతుంటే.. థియేటర్లో ప్రేక్షకుల మనసుల్లో ఏవేవో మెదులుతుంటాయి. ఆ క్యారెక్టర్లు నవ్వితే ఇక్కడ పెదాలు విచ్చుకుంటాయి. అవి కన్నీరు పెడితే ఇక్కడ కళ్లు చెమ్మగిల్లిపోతాయి. అంతగా ఆడియెన్స్ ను తన కథలో ఇన్‌వాల్వ్ చేయగలిగే శక్తి కొందరు దర్శకులకే ఉంటుంది. వారిలో కృష్ణవంశీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది.

మెప్పించి ఒప్పించాడు

ఏదో ఒక నిరాశ.. ఏదో ఒక ఆవేశం.. కలలు గని పోలీసైన కుర్రాణ్ని నక్సలైట్‌గా మార్చేశాయి. అడవి బాట పట్టాడు. తుపాకీ గురిపెట్టాడు. అతడు నడిచే దారితో ప్రేక్షకుడికి సంబంధం లేదు. అతనికి న్యాయం జరగాలంతే. తన బతుకేదో తాను బతికే మరో యువకుడు. నాన్న, చెల్లి, ప్రేయసి.. ఇదే అతని లోకం. చెల్లికి పెళ్లి చేశాడు. అత్తింటి ఆరళ్లకు ఆమె బలైపోతే నిలువునా రగిలిపోయాడు. ఇంకే ఆడపిల్లకీ అన్యాయం జరగనివ్వని ప్రతిజ్ఞ చేశాడు. అమ్మాయిల జోలికి వెళ్లిన ప్రతివాడినీ పెట్రోలు పోసి తగులబెట్టాడు. అతడు చేసింది నేరమే అయినా ప్రేక్షకుడికి లెక్క లేదు. అతనికి శిక్ష పడటానికి వీల్లేదంతే. ఓ నెగిటివ్ విషయాన్ని కూడా పాజిటివ్‌గా తీసుకుంటున్నారంటే అది కేవలం కేవీ మ్యాజిక్. కథలో బలమైన ఎమోషన్స్ పెట్టి, చూసేవాళ్ల గుండెల్ని బరువెక్కించి, ఆయన ఏది కరెక్ట్ అనుకుంటున్నాడో ప్రేక్షకుడు కూడా అదే కరెక్ట్ అనుకునేలా చేయడంలో సిద్ధహస్తుడాయన. సౌందర్య ‘అంత:పురం’ లోంచి బయటపడాలని ఆమె కంటే ఎక్కువ ఆడియెన్స్ టెన్షన్ పడిపోయారు. ‘నిన్నే పెళ్లాడతా’ అన్నాడే కానీ నాగార్జున టబుని ఎక్కడ మనువాడడో అని తెగ ఫీలైపోయారు. ఆగస్టు 15న తప్ప జెండా ముఖమే చూడనివాళ్లు సైతం ‘ఖడ్గం’ చేతబట్టి దేశద్రోహుల అంతు చూడాలని ఆవేశంతో ఊగిపోయారు. ఇదంతా ఎందువల్ల! కృష్ణవంశీ మాయలో పడిపోవడం వల్ల. తాను నమ్మినదాన్ని అవతలివారూ నమ్మేలా చేయడం, ఎటువంటి విషయాన్నైనా అందంగా చెప్పి మెప్పించి ఒప్పించడం తెలిసిన దర్శకుడికి హ్యాట్సాఫ్‌ చెప్పకుండా ఉండగలడా ప్రేక్షకుడు!

అవన్నీ ఉండాల్సిందే!

కృష్ణవంశీ సినిమాల్ని అబ్జర్వ్ చేస్తే కొన్ని చాలా కామన్‌గా కనిపిస్తుంటాయి. వాటిపై ఆయనకి ఇష్టమో లేక ఏదైనా సెంటిమెంటో తెలీదు కానీ.. ప్రతి సినిమాలోనూ అవి పలకరిస్తుంటాయి. కృష్ణవంశీకంటూ ఓ శైలిని క్రియేట్ చేసింది కూడా అవేనని చెప్పొచ్చు. ఆయన సినిమాల్లో కృష్ణుడు ఎక్కువగా కనిపిస్తుంటాడు. హీరోల క్యారెక్టర్లు కూడా కన్నయ్య మాదిరి కాస్త చిలిపిగాను, అల్లరిగాను, సందడిగాను ఉంటాయి. ఇక హీరోయిన్లందరూ సత్యభామ మాదిరిగా ఉంటారు. చాలా బలమైన వ్యక్తిత్వం ఉంటుంది వారికి. అందంగా ఉంటారు. కాస్త అమాయకత్వమూ ప్రదర్శిస్తారు. ముక్కుమీద కోపం ఉంటుంది. అయినా కూడా ముచ్చటగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు కానీ.. ఆ అందాల అతివపై ఓ మంచి రొమాంటిక్ సాంగ్ కూడా పెడతారు కేవీ. ఆ పాట కచ్చితంగా నీటిలో ప్లాన్ చేస్తుంటారు. ఇక యాక్టర్స్ అందరినీ నేచురల్‌గా చూపిస్తుంటారాయన. ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఓవర్‌‌గా మేకప్ ఉండదు. అనవసరమైన ఫ్యాషన్లు ఉండవు. సింపుల్‌గా రెడీ అయ్యి చక్కగా కనిపిస్తుంటారు. కాకపోతే అందరూ మ్యాగ్జిమమ్ లౌడ్‌గా మాట్లాడుతుంటారు. అల్లరి చేస్తుంటారు. అలుగుతుంటారు. ఎవరో ఒక పెద్దమనిషి మాత్రం వీళ్లందరినీ గైడ్ చేస్తుంటారు. తన మాట మిగతా వారందరూ వింటుంటారు. ఇవి చాలా సినిమాల్లో రిపీటవుతూ కనిపిస్తుంటాయి. అందుకే కృష్ణవంశీ సినిమాని మనం ఠక్కున గుర్తు పట్టేయొచ్చు. ఇది ఆయన స్టైల్ అని బల్ల గుద్ది చెప్పేయవచ్చు.

కాస్త తడబడితేనేం..

విజయం వెంట పరాజయం రావడం సహజం. గెలిచిన ప్రతివాడూ ఏదో ఒక సమయంలో ఓడడమూ నేచురల్. కేవీ కెరీర్‌‌ కూడా ఒకచోట కుంటుపడింది. ఆయన టేకింగ్ తడబడింది. మహాత్మ, మొగుడు, పైసా, గోవిందుడు అందరివాడేలే, నక్షత్రం లాంటి ఫెయిల్యూర్స్ పలకరించాయి. అంతకుముందు ఎప్పుడూ ఆయన ఫ్లాప్స్ చూడలేదని కాదు. కానీ ‘చందమామ’ తర్వాత వరుస పరాజయాలు రావడంతో ఒకసారి పరుగు ఆపాల్సి వచ్చింది. అయితేనేం.. కొత్త సినిమా ప్రకటన రాగానే అదంతా మరుగునపడిపోయింది. ‘రంగమార్తాండ’ కోసం వెయిటింగ్ మొదలయ్యింది. అంతలోనే ‘అన్నం’ అనే మరో సినిమా ప్రకటన రావడంతో అందరిలోనూ ఆనందం. భారీ బడ్జెట్ తో ఓ వెబ్ సిరీస్ తీయబోతున్నారని తెలిసి మరింత సంతోషం. కాస్త గ్యాప్ తీసుకుని వస్తున్న కేవీ ఫుల్లుగా రీచార్జ్ అయి ఉంటారని అందరి నమ్మకం. ఆ నమ్మకం నిజమవ్వాలని, ఆయన మరిన్ని మంచి చిత్రాలతో ఆడియెన్స్ ను అలరించాలని కోరుకుందాం..