Mahi V Raghav: స్టూడియోకి స్థలం కేటాయింపు..యాత్ర 2 డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్!

Mahi V Raghav: స్టూడియోకి స్థలం కేటాయింపు..యాత్ర 2 డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మహి వి రాఘవ్(Mahi v raghav) తెరకెక్కించిన యాత్ర2 మూవీ ఫిబ్రవరి 8న రిలీజై పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. 2008 నుంచి రాఘవ్  సినిమా ఇండస్ట్రీలో రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తన టాలెంట్ను నిరూపించుకుంటూ వస్తున్నారు. 

2019లో ఆయన తెరకెక్కించిన యాత్ర, లేటెస్ట్ యాత్ర 2 సినిమాలు చేసినందుకుగానూ ఏపీ ప్ర‌భుత్వం డైరెక్టర్ మ‌హి వి.రాఘ‌వ్‌కి స్టూడియో నిర్మాణం కోసం రెండెక‌రాలు భూమి మ‌ద‌న‌ప‌ల్లిలోని హ‌ర్సిలీ హిల్స్‌లో ఇచ్చిందంటూ కొన్ని మీడియా ఛానళ్లలో వార్తలు వచ్చాయి. వీటిపై ఆయన ఘాటుగా స్పందించారు. 'నేను రచయిత, నిర్మాత, దర్శకుడిగా సినీ పరిశ్రమలో 16 ఏళ్లుగా ఉంటున్నాను. అంతేకాకుండా మూన్ వాట‌ర్ పిక్చర్స్, 3 ఆట‌మ్ లీవ్స్ అనే రెండు నిర్మాణ సంస్థ‌లు స్థాపించి పలు సినిమాలు తీశాను. నేను రాయ‌ల‌సీమ ప్రాంతంలోని మ‌ద‌న‌ప‌ల్లిలోనే పుట్టి పెరిగా, అక్క‌డే చదువు కూడా పూర్తి చేశా. నిజానికి సినీ ఇండస్ట్రీలో రాయ‌ల‌సీమ ప్రాంతానికి ఎక్కడ పెద్ద‌గా ప్రాధాన్యం ఉండ‌దు. రాయలసీమ ప్రాంతంలో షూటింగ్స్ జరపడానికి ఏ ఒక్కరూ ఆస‌క్తి చూపించ‌రని మహి రాఘవ్ అన్నారు.

"నేను పాఠ‌శాల‌ మూవీని, యాత్ర 2, సిద్ధా లోక‌మెలా ఉంది, సైతాన్ వెబ్ సిరీస్ రాయ‌ల‌సీమ‌లోని మ‌ద‌న‌ప‌ల్లి, క‌డ‌ప ప్రాంతాల్లో షూట్ చేశా.. ఆ మూడు ప్రాజెక్ట్స్‌కి దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేశా.. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి నా వంతుగా ఏదో చేయాల‌నే ఉద్దేశమే అక్కడ షూట్ చేసేలా చేసింది. అక్కడ షూట్ చేయడం వల్ల లాడ్జీలు, హోటల్స్‌, భోజ‌నాలు, జూనియ‌ర్స్ ఇలా పలు రకాలుగా స్థానికులకు నేను తెరకెక్కించే సినిమాల ద్వారా ఉపయోగం ఉంటుందని భావించా.. అందుకే 25 కోట్ల వరకు ఖర్చు పెట్టగలిగా.."   

"నా సినీ ప్రయాణంలో నేను వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాయ‌ల‌సీమ‌లో మినీ స్టూడియో నిర్మించాల‌నుకున్నా.. అందువ‌ల్ల స్థానికత భవిష్యత్తు కోసం ఆలోచించా.. అంతేకానీ, నేనేమీ స్టూడియో నిర్మాణం కోసం యాబై, వంద ఎక‌రాలు కావాలని అడ‌గ‌లేదు.  నేను కేవ‌లం రెండు ఎక‌రాల్లో మాత్రమే మినీ స్టూడియో నిర్మించాల‌నుకున్నా. .దాని వ‌ల్ల అక్క‌డెవ‌రైనా షూటింగ్స్ చేసుకోవాల‌నుకుంటే అంద‌రికీ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఈ విషయాన్ని కాస్తా బుద్ధి ఉన్నోడెవ‌డైనా ఆలోచించాలి.. ఇన్నేళ్లు ఇండ‌స్ట్రీ ఉంది కదా.. ఇప్పటివరకు రాయ‌ల‌సీమ‌కు ఎవ‌డైనా ఏమైనా చేశారా! ఏమీ చేయ‌లేదు కదా. మీరు చేయ‌రు.. చేసేవాడిని చెయ్య‌నియ్య‌రు. నేను పుట్టి పెరిగిన నా ప్రాంతంలో కేవ‌లం రెండు ఎకరాల్లో, అక్క‌డి ప్ర‌జల‌కు ఉప‌యోగ‌ప‌డే ఉద్దేశంతో మినీ స్టూడియో క‌ట్టాలని అనుకుంటే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారు.." అని మహి రాఘవ్ అన్నారు. ఇక తన ప్రాజెక్ట్స్‌లో ఆనందో బ్ర‌హ్మ‌, సేవ్ ది టైగ‌ర్స్ వెబ్ సిరీస్‌ ను మాత్రం రాయలసీమలో తెరకెక్కించలేదు. ఎందుకంటే ఈ సినిమాల కథాంశం మేరకు వేరే చోట తీయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.