చులకన చేసే నోళ్ళు ఉన్నప్పుడు.. చురకలు వేయాలి: హరీష్ మాస్ కౌంటర్

చులకన చేసే నోళ్ళు ఉన్నప్పుడు.. చురకలు వేయాలి: హరీష్ మాస్ కౌంటర్

తెలుగు సినిమా ఇండస్ట్రీని తక్కువగా మాట్లాడితే నేను ఊరుకోను. అందుకే, చులకన చేసే నోళ్ళు ఉన్నప్పుడు.. చురకలు వేసే నోళ్ళు కూడా ఉండాలంటూ మాస్ కౌంటర్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. తాజాగా ఆయన మలయాళ మూవీ 2018 తెలుగు రిలీజ్ కు సంబందించిన ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. ఇందులో భాగంగా హరీష్ ఒక రిపోర్టర్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ప్రెస్ మీట్ కు వచ్చిన ఆ విలేఖరి.. 2018 సినిమా చాలా బాగుంది. కానీ ఈ సినిమా చూశాక మన తెలుగు డైరెక్టర్‌ ఇలాంటి సినిమాలు తీయగలరా? ఇక్కడి నిర్మాతలు ఆ సాహసం చేయగలరా? అని మీకు అనిపించిందా?' అని ప్రశ్నించాడు. 

దానికి సమాదానంగా హరీష్..'ప్రెస్‌మీట్స్‌ జరిగిన ప్రతిసారి మీరు ఇలాంటి సాహసోపేతమైన ప్రశ్నలు అడిగి సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా మారుతూ యూట్యూబ్‌లో ఒక ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు. ప్రపంచ సినిమా మన చేతికొచ్చేసింది. ప్రస్తుతం మనం అలాంటి టెక్నాలజీలో ఉన్నాం. ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి, కేజీఎఫ్‌లను ఎవరైనా డబ్బింగ్‌ సినిమా అనుకున్నారా? డబ్బింగ్‌, రీమేక్‌ అదంతా ఏమీ లేదు. కేవలం సినిమా అంతే. ఏ సినిమా ఎక్కడికెళ్లినా సంతోషించాలి. తెలుగు దర్శకులు ఇలాంటి సినిమాలు తీయరా? అని అడుగుతున్నావ్‌ కదా.. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తున్నప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారంటే జాలేస్తోంది. అతడు కేరళ డైరెక్టర్‌ అని ఈ సినిమా చూడలేదు. ఆయనో గొప్ప సినిమా తీశారని పత్రికాముఖంగా ఆయన్ను మెచ్చుకుందామని వచ్చాను. 

గీతా ఆర్ట్స్‌ డబ్బింగ్‌ సినిమాలకే పరిమితమైపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు కదా.. నేనే వరుసగా 100 డబ్బింగ్‌ సినిమాలు చేయిస్తా.. అందులో తప్పేంటి? ఒక మంచి సినిమాను పదిమందికి చూపించే ప్రయత్నాన్ని ప్రశంసించాలి. ఈ సినిమాను ముందు మీకే చూపించాలని నిర్మాత అన్నాడు. ఎందుకంటే సినిమా నచ్చితే మీరు చేసినంత ప్రమోషన్స్‌ నిర్మాత కూడా చేయలేడు. డబ్బింగా? రీమేకా? అన్నది కాదు.. మంచి సినిమాలు చేస్తాం. సినిమా అనేది ఒక ఎమోషన్‌.. దానికి భాషతో సంబంధం లేదు' అని చెప్పుకొచ్చాడు హరీశ్‌ శంకర్‌. 

ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ.. చులకన చేసే నోరు ఉన్నప్పుడు, చురకలు వేసే నోరు కూడా ఉంటుందని ట్వీట్‌ చేశాడు హరీష్. ఇక 2018 సినిమా మలయాళంలో సంచలనం సృష్టించింది. కేవలం వారం రోజుల్లోనే వంద కోట్లు వసూళ్లు రాబట్టి అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. టొవినో థామస్‌, కుంచక్కో బోబన్‌, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జూడ్‌ ఆంటోని జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో  మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.